అగ్ర కథానాయకులంతా రూటు మార్చారు. పారితోషికాలతో పాటు సినిమాలో వాటానీ అందుకుంటున్నారు. `సరిలేరు నీకెవ్వరు` కోసం మహేష్ అదే చేశాడు. అటు పారితోషికం, ఇటు లాభాల్లో వాటా రెండూ అందుకున్నాడు. సర్కారు వారి పాట విషయంలోనూ అదే ఫార్ములా. ఈ సినిమా నిర్మాణంలో మహేష్ కీ వాటా ఉంది. తాజాగా త్రివిక్రమ్ తో ఓ సినిమా చేస్తున్నాడు మహేష్. `సర్కారు..` తరవాత… మహేష్ చేయబోయే సినిమా ఇదే. ఇందులోనూ… మహేష్ కి వాటా ఉంటుందని, తన ఏఎంబీని భాగస్వామిగా చేయబోతున్నాడని అనుకున్నారు. అయితే ఈ రోజే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. ప్రొడక్షన్ హౌస్ జాబితాలో హారిక హాసిని పేరు ఒక్కటే కనిపించింది. ఏఎంబీ లేదు. అంటే…ఈ సినిమా వరకూ మహేష్ కేవలం పారితోషికంతోనే సరిపెట్టుకోబోతున్నాడన్నమాట. హారిక – హాసిని అంటే.. కచ్చితంగా త్రివిక్రమ్ కీ వాటా ఉంటుంది. ఇప్పుడు మహేష్ కూడా వస్తే… మూడు వాటాలు వేయాల్సివస్తుంది. అందుకే… మహేష్ నిర్మాణంలోకి దిగలేదేమో..? `సరిలేరు..`కి మహేష్ ఏకంగా 50 కోట్ల పారితోషికం అందుకున్నాడు. ఈసారి అంతకంటే ఎక్కువే ఇచ్చారని, అందుకే.. మహేష్ లాభాల్లో వాటా తీసుకోబోవడం లేదని సమాచారం.