మహర్షి సినిమా పై మహేష్ బాబు ముందు నుంచీ నమ్మకంతోనే ఉన్నాడు. ఆ నమ్మకమే నిజమైంది. ఈ సినిమా మహేష్ బాబు గత సినిమాల రికార్డులన్నీ తిరగరాసింది. దాంతో మహేష్ ఫుల్ ఖుషీ అయిపోతున్నాడు. ఈ సినిమా ఇలాంటి విజయం సాధిస్తుందని ముందే ఊహించానని అంటున్నాడు మహేష్. ఈరోజు విజయవాడలో.. మహర్షి విజయోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ “డెహ్రాడూన్లో తొలి రోజు షూటింగ్ అయిపోగానే ఈ సినిమా పోకిరి స్వ్కేర్ అవుతుందని ఊహించా. అది నిజమైంది. ఈ సినిమాలో నా మూడు గెటప్పులూ బాగా నచ్చాయి. అందులో స్టూడెంట్ పాత్ర చేయడం మరింత కిక్ ఇచ్చింది. నా సినిమా బాగా ఆడితే అభిమానులు ఎక్కడ కి తీసుకెళ్తారో నాకు తెలుసు. ఇది నా 25వ సినిమా. చాలా స్పెషల్. నా పాత సినిమా రికార్డులన్నీ తొలి వారంలోనే దాటించేసిన అభిమానులకు సలాం” అని ఉద్వేగ భరితంగా చెప్పాడు. తనతో తొలి సినిమా చేసిన రాఘవేంద్రరావుని ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశాడు మహేష్.
“రాజకుమారుడు సమయంలో నాకేం తెలీదు. ఎలా నడవాలో, ఎలా మాట్లాడాలో అర్థమయ్యేవి కావు. సినిమా అంతా అయిపోయేంత వరకూ గందరగోళంగా ఉండేది. ఏంటిది మావయ్యా అని రాఘవేంద్రరావుగారిని అడిగాను. నువ్వేం కంగారు పడకు. ఈసినిమా సూపర్ హిట్టు అవుతుంది. నువ్వు సూపర్ స్టార్ అవుతావు అని ధైర్యం చెప్పారు. ఆయన్ని ఎప్పటికీ మర్చిపోలేను” అన్నాడు. అలాగే విజయవాడ గురించీ చెప్పుకొచ్చాడు. తానెప్పుడూ విజయవాడ రావడానికి ప్లాన్ చేసుకోనని, తన సినిమా హిట్టయిన తరవాత బెజవాడ దుర్గమ్మే తనని పిలుస్తుందని చెప్పుకొచ్చాడు మహేష్.