జనవరి 12.. ప్రస్తుతం ఈ డేట్ గురించే టాలీవుడ్ ఆరా తీస్తోంది. జనవరి 12న వచ్చేదెవరు? రిలీజ్ డేట్ మార్చుకునేదెవరు? అనే ఆసక్తికరమైన ప్రశ్నలు చక్కర్లు కొడుతున్నాయి.
మహేష్ బాబు సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’, అల్లు అర్జున్ సినిమా ‘అల వైకుంఠపురములో’ రెండూ 12నే వస్తున్నాయని ప్రకటించుకున్నాయి. రెండు పెద్ద సినిమాలూ ఒకే రోజు వస్తే నష్టం కనుక.. మహేష్ సినిమా 11కి మారిందని, బన్నీ 12నే వస్తున్నాడని చెప్పుకుంటున్నారు. లోపాయికారి ఒప్పందం కుదిరిపోయిందని, ఇక అధికారిక ప్రకటన రావడమే తరువాయి అని అనుకున్నారు. కానీ మహేష్ మాత్రం రిలీజ్ డేట్ మార్చడానికి ససేమీరా అంటున్నాడని తెలుస్తోంది. కావాలంటే వాళ్లనే 11న రమ్మనండి – అంటూ మహేష్ తేల్చేస్తున్నాడట. ఇద్దరు నిర్మాతలూ మాట్లాడుకుని, ఓ ఒప్పందానికి వస్తున్న తరుణంలో ఇలా మహేష్ మోకాలడడ్డడం సమస్యగా మారుతోంది.
‘సరిలేరు నీకెవ్వరు’ ని 12న విడుదల చేస్తామన్న తరవాతే… అల వైకుంఠపురం రిలీజ్ డేట్ బయటకు వచ్చింది. దాంతో క్లాష్ మొదలైంది. ‘ముందు మనమే రిలీజ్ డేట్ ప్రకటించాం. కాబట్టి.. వాళ్లే మార్చుకోవాలి’ అన్నది మహేష్ వాదన. నిజానికి ఏ సినిమా ముందుగా విడుదలైతే, ఆ సినిమాకి థియేటర్ల పరంగా అడ్వాంటేజ్ ఉంటుంది. 11న రావడం మహేష్‌కి ఓ విధంగా మంచిది. ఆలస్యంగా వచ్చిన సినిమాకి మరో రకమైన ప్రయోజనం. తొలి సినిమా టాక్ అటూ ఇటూ అయితే.. రెండో సినిమా ఎలాగున్నా చూసేస్తారు. మహేష్ పట్టుదల వల్ల.. కొత్త రిలీజ్ డేట్ ప్రకటించలేక తర్జనభర్జనలు పడుతున్నారు నిర్మాతలు. ఒకవేళ 11న రావడం ‘అల వైకుంఠపురములో’ టీమ్‌కి ఓకే అయితే.. ఈ సమస్య సద్దుమణిగినట్టే. కానీ ఈ విషయంలో `అల…` నిర్మాత కూడా కామ్‌గానే ఉన్నాడు. మరి.. ఏం జరుగుతుందో చూడాలి.