‘సముద్రం కోసం వైజాగ్ వరకూ వెళ్లాలా? హైదరాబాద్‌లోనే ఓ సెట్టేసేయ్ కూడదూ…’
– ఓ సినిమాలోని డైలాగ్ ఇది. అందుకే వెండి తెరపై సహజత్వం చెరిగిపోయి కృత్రిమత్వం తాండవం చేస్తుంటుంది. కొన్ని కొన్ని సార్లు.. హీరోలు ‘సెట్టింగులే వేయండి’ అని డిమాండ్ చేస్తుంటారు. మహేష్ బాబు వ్యవహారం ఇలానే ఉందని టాక్.
అవును… మహేష్ తో సినిమా అంటే నిర్మాతలకు ఇప్పుడు కొత్త తరహా తలనొప్పి చుట్టుకుంది. మహేష్ పారితోషికాన్ని అవలీలగా భరించే నిర్మాతలు సైతం ఈ కొత్త షరతులకు బాగా ఇదైపోతున్నారని తెలుస్తోంది. అవుడ్డోర్ షూటింగ్ అంటే మహేష్ రావడానికి నిరాకరిస్తున్నాడని, దాని బదులుగా సెట్ వేయాలని డిమాండ్ చేస్తున్నాడని ఇండ్రస్ట్రీలో ఓ టాక్ గట్టిగా వినిపిస్తోంది. ‘మహర్షి’ సినిమాలో కొన్ని సన్నివేశాలు పల్లెటూరు నేపథ్యంలో తీయాల్సిన అవసరం వచ్చింది. వాటిని తూగో జిల్లాలోని ఓ పల్లెటూరులోనో, లేదంటే కేరళలోనే తీయాలని చిత్రబృందం నిర్ణయించుకుంది. అయితే.. మహేష్ మాత్రం దానికి నో చెప్పాడట. కేవలం మహేష్ కోసమే.. రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ పల్లెటూరు సెట్ వేశారు. దాని కోసం కోట్లకు కోట్లు ఖర్చు పెట్టారు. తాజాగా ఓ సన్నివేశం కోసం బీడు వారిన భూమిని చూపించాల్సివచ్చిందట. రాయలసీమలోని ఏ ప్రాంతానికి వెళ్లినా బీడువారిన భూమి కనిపిస్తుంటుంది. అయితే మహేష్ మాత్రం అవుడ్డోర్ షూటింగ్‌కి రానని మొరాయించడంతో… దాన్ని కూడా ఫిల్మ్‌సిటీలోనే తెరకెక్కించేశారని సమాచారం.
మహేష్ లాంటి కథానాయకుడు అవుడ్డోర్ షూటింగుకు వెళ్తే చాలా కష్టం. అక్కడి క్రౌడ్‌ని కంట్రోల్ చేయలేరు. అందుకే ఇలా సెట్స్‌కి పరిమితం అవుతుంటారు. కాకపోతే నిజంగానే అవుడ్డోర్‌లో తీయాల్సిన సన్నివేశాలు కూడా ఇలా సెట్టింగులతో సరిపెట్టుకుంటే ఇక సహజత్వం ఎక్కడి నుంచి వస్తుంది..? సహజత్వం మాట అటుంచండి… సెట్ల పేరుతో కోట్లకు కోట్లు ఖర్చు చేయాల్సివస్తోంది. బీడు వారిన భూమి.. ఎక్కడైనా ఫ్రీగా కనిపిస్తుంది. కానీ దాన్ని రామోజీ ఫిల్మ్ సిటీలో చూపించాలంటే ఎంత ఖర్చు..? పల్లెటూరికి వెళ్లి కొన్ని సన్నివేశాల్ని పూర్తి చేసుకొస్తే కోట్లకు కోట్లు మిగులుదును. ఇదంతా నిర్మాతలకు కలిసొచ్చేదే కదా? కానీ మహేష్ సినిమా అంటే వీటన్నింటినీ భరించే ముందడగు వేయాలి. తప్పదు మరి.