తెలంగాణలో ఏర్పడిన రెండో ప్రభుత్వంలో… ముఖ్యమంత్రి కేసీఆర్ ..మహమూద్ అలీకి హోంశాఖను కేటాయిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిజానికి ఇంకా పూర్తి స్థాయి కేబినెట్ … ఆ మాటకొస్తే.. ముఖ్యమంత్రి కాకుండా ప్రమాణం చేసి.. ఒకే ఒక్క మహమూద్ అలీ మాత్రమే . అయినప్పటికీ.. ముందే నిర్ణయించుకున్నట్లుగా.. ఉదయం ప్రమాణస్వీకారం చేయగానే.. సాయంత్రం.. హోంశాఖను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదే రాజకీయవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. గతంలో నాయిని నర్సింహారెడ్డి హోం మంత్రిగా ఉండేవారు. ఆయనను ఈ సారి పక్కన పెట్టడం ఖాయమని దీంతో తేలిపోయింది. అయితే.. మహమూద్ అలీనే ఎందుకు ఎంపిక చేసుకున్నారన్న సందేహం మాత్రం చాలా మందిలో వస్తోంది.
తెలంగాణ మొదటి ప్రభుత్వంలో హోంమంత్రిగా నాయిని నర్సింహారెడ్డి ఉన్నప్పటికీ.. ఆయనకు తన శాఖపై.. కనీస అధికారం ఉందని ఎవరూ అనుకోలేదు. కనీసం కానిస్టేబుల్‌ను కూడా బదిలీ చేయలేరని.. అందరూ చెబుతూ ఉంటారు. ఇప్పుడు… హోంమంత్రి అయిన మహమూద్ అలీ కూడా అంతే. ఆయన అంతకు ముందు డిప్యూటీ సీఎం హోదాలో.. రెవిన్యూ శాఖను చూసుకున్నారు. అచ్చంగా ఆయన చూసుకున్నారు. దాంట్లో ఆయన చేసిందేమీ లేదు. ఇప్పుడు కూడా.. హోంమంత్రి హోదాను ఆయన చూసుకుంటారు .. చేయడానికి ఏమీ ఉండదు. సాంకేతికంగా మైనార్టీకి హోంమంత్రి పోస్ట్ ఇచ్చారనే పేరు మాత్రం వస్తుంది. అయితే.. ఈ సమీకరణం మాత్రమే కాదని… మహబూద్ అలీకి హోంమంత్రి పోస్ట్ ఇవ్వడం ఓవైసీ బ్రదర్స్ కోరిక అని చెబుతున్నారు.
మజ్లిస్ ఈ ఎన్నికల్లో అవుట్ రైట్‌గా టీఆర్ఎస్కు సపోర్ట్ చేసింది. హంగ్ అంటూ వస్తే.. మజ్లిస్ ప్రభుత్వంలో భాగస్వామి అవుతుందని… అక్బరుద్దీన్ హోం మంత్రి అవుతారని ఎన్నికలకు ముందే గుప్పుమంది. బహుశా.. హంగ్ వస్తే అదే జరిగి ఉండేదేమో. రాలేదు కాబట్టి… అవసరం రాలేదు కాబట్టి.. మజ్లిస్‌కు బదులుగా వారి చాయిస్… మహమూద్ అలీకి చాన్సిచ్చినట్లు తెలుస్తోంది. మహమూద్ అలీ కూడా పాతబస్తీకి చెందిన వ్యక్తే. కానీ ఆయన తన కుమారుడ్ని కూడా కార్పొరేటర్‌గా గెలిపించుకోలేరు. జనాన్ని మొబిలైజ్ చేయలేదు. అందుకే… మజ్లిస్ తాము కాకపోతే ఆయన అని ఓకే చేసింది. ఇప్పుడు..మహమూద్ అలీ చేతిలో హోంశాఖ ఉన్నా.. పాతబస్తీ వరకూ పెత్తనం చేసేది…. అక్బరుద్దీన్ మాత్రమేనని.. ఇప్పటికే అక్కడ ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమేమో..?