పార్లమెంట్లో ప్రభుత్వంపై విరుచుకుపడే గొంతుల్లో నెంబర్ వన్ అయిన తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా సభ్యత్వాన్ని ఎథిక్స్ కమిటీ సిఫారసు మేరకు లోక్ సభ రద్దు చేసింది. ఆమె డబ్బులు తీసుకుని పార్లమెంట్ లో ప్రశ్నలు అడిగారని ఎథిక్స్ కమిటీ నిర్ధారించింది. ఈ కారణంగా పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేశారు. దీని వల్ల పార్లమెంట్ సమావేశాల్లో ఆమె పాల్గొనలేరు. ప్రభుత్వాన్ని ప్రశ్నించలేరు. గత నాలుగున్నరేళ్ల కాలంలో లోక్ సభలో అనేక అంశాలపై కేంద్రాన్ని నిలదీసిన ప్రసంగాల్లో అత్యధికం మహువా మొయిత్రావే.
అదానీ అక్రమాలుతో పాటు ప్రతి అంశాన్ని ఆమె లోక్ సభ ముందుపెట్టే విషయంలో ఎప్పుడూ భయపడలేదు. తన వ్యక్తిగత జీవితంలో వచ్చిన విబేధాల వల్ల వెలుగులోకి వచ్చిన కొన్ని వివరాల సాయంతో..కంట్లో నలుసుగా ఉన్న మహువాపై వేటు వేశారు. ఇలాంటి అవకాశం కోసం బీజేపీ చాలా కాలంగా ఎదురు చూస్తున్నట్లుగా ఉంది. చాన్స్ దొరకగానే వేటు వేసేసింది. నిజానికి ఎథిక్స్ కమిటీకి.. ఎవరిదైనా సభ్యత్వాన్ని రద్దు చేయాలని సిఫారసు చేసే అధికారం లేదన్న అభిప్రాయం పార్లమెంట్ నిపుణుల్లో ఉంది. తప్పో…ఒప్పో చెప్పడం.. తప్ప.. శిక్షించాలనే అధికారం ఉండదని అంటున్నారు. కానీ ఏకంగా లోక్సభ సభ్యత్వం రద్దుకు సిఫారసు చేశారు. లోక్ సభ ఆమోదించింది. ఇలా గట్టి వాయిస్ ఉన్న ఓ మహిళా ఎంపీ.. అర్థం పర్థం లేని ఆరోపణలతో బహిష్కరిస్తే అది చెడు సంప్రదాయం అవుతుందన్న ఆందోళన ప్రజాస్వామ్య వర్గాల్లో ఉంది.
నిజానికి ఆమె లాగిన్ ను ఇతరులు వాడారని నిర్ధారించారు కానీ…డబ్బులు తీసుకన్నారన్న విషయాన్ని మాత్రం ఖరారు చేయలేదు. లాగిన్ ను … కూడా నిబంధనల ప్రకారం ఎంపీ అనుమతితో వ్యక్తిగత సిబ్బంది ఓపెన్ చేసుకోవచ్చు. అయితే మహువాను బహిష్కరించాలనుకున్నారు కాబట్టి.. అన్నీ పద్దతి ప్రకారం చేసేశారు. ఇప్పుడు గుండెల మీద చేయి వేసుకుని ఉంటారు.