రాజకీయం ప్రధానంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మీద నిలబడుతుంది. ఇలాంటి పార్లమెంటరీ వ్యవస్థల్లో విలువలు ఎలా దిగజారిపోతున్నాయో కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. అయితే ఇలాంటి సందర్భాల్లోనూ ప్రజాస్వామ్య పునాదుల్ని పటిష్టం చేసేలా కొంత మంది మెరుపు తీగలు… ఆవిర్భవిస్తూనే ఉంటాయి. అలాంటి వారిలో ఒకరు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా. ప్రస్తుతం లోక్‌సభలో ధాటిగా ప్రభుత్వంపై విరుచుకుపడే అతి కొద్ది మంది విపక్ష ఎంపీల్లో ఆమె ఒకరు.
మంగళవారం ఆమె.. లోక్‌సభలో ప్రభుత్వం ప్రకటించుకునే ఘనమైన గణాంకాల డొల్లతనాన్ని తన ప్రసంగం ద్వారా దేశం ముందు ఉంచారు. ఇప్పుడు చెప్పండి.. ఎవరు పప్పు ? అంటూ ప్రభుత్వాన్ని కడిగి పారేశారు. ఆమె అడిగిన ప్రశ్నలకు.. ప్రభుత్వం వద్ద సమాధానం ఉండదు. ఏమైనా ఉంటే..ఎదురుదాడి మాత్రమే. ఎందుకంటే.. పక్కా వివరాలతో.. సూటిగా .. సుత్తి లేకుండా మొయిత్రా చేసిన ప్రసంగంలో లోపాలే ఉండవు. అందుకే ఆమె ప్రసంగం వైరల్ అయింది. ఇదే మొదటి సారి కాదు.. మహవా మొయిత్రా ఎప్పుడు పార్లమెంట్లో మాట్లాడినా.. . ఆ స్పీచ్ వైరల్ అవుతుంది. బీజేపీ నాయకులకు నిద్రపట్టకుండా చేస్తుంది. ఆమె ప్రసంగ శైలికి.. ప్రభుత్వాన్ని నిలదీసే విధానానికి లక్షల మంది అభిమానులు ఉన్నారు.
కోల్‌కతాలో పుట్టి ఉన్నత చదువులు చదువుకుని విదేశాల్లో ఉన్నతోద్యగం కూడాచేసిన మహువా మెయిత్రా తృణమూల్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. ఎప్పుడూ భయపడింది లేదు. ఆమె బీజేపీపై విరుచుకుపడే విధానం.. ఆ పార్టీ విధానాల్ని ఖండించే తీరును… ఎలా ఎదుర్కోవాలో బీజేపీ నేతలకు తెలియదు. అందుకే ఆమె ఖరీదైన హ్యండ్ బ్యాగ్ వాడతారని.. ఓ సారి ఫోటోలు తీసి వైరల్ చేస్తారు. బహిరంగంగా చేతితో పట్టుకునే బ్యాగ్ ను కూడా… దాచి పెడుతున్నారంటూకథలు అల్లుతారు. ఓ సారి వేరే ఎంపీకి చెందిన కారులో పార్లమెంట్‌కు వస్తే అది ఆమేదేనని బీజేపీ సోషల్ మీడియా ప్రచారం చేసింది. అయితే ఇలాంటి ప్రచారాలకు ఎక్కడా ఒణకడం.. తొణకడం.. ఆమె పద్దతి కాదు. వారికి వారి పద్దతిలోనే సమాధానం చెబుతుంది.
మహువా మొయిత్రా ప్రస్తుతం ఓ సైన్యంలా పోరాడుతున్నారు. బీజేపీ విషయంలో ఎంతో మంది వెనక్కి తగ్గినా.. ఆమె మాత్రం తన వాయిస్‌లో బేస్ తగ్గనివ్వడం లేదు. చివరికి తమ అధినేత్రి మమతా బెనర్జీ నియంత్రించాలని చూసినా..తగ్గడం లేదు. ఇలాంటి ఫైటర్ల వల్లే ప్రజాస్వామ్యం కాస్త గట్టిగా నిలబడుతూ ఉంటుదనేది ఎక్కువ మంది అభిప్రాయం.