మేఘా ఇంజినీరింగ్ కంపెనీ యజమానికి పీవీ కృష్ణారెడ్డి ఇళ్లు, నివాసాలపై ఐటీ అధికారులు జరిపిన దాడుల వ్యవహారంలో ప్రధానమైన మీడియా మౌనాన్నే ఆశ్రయించింది. ఐటీ దాడుల విషయం బయటకు పొక్కగానే.. మేఘా ఇంజినీరింగ్ సంస్థకు చెందిన పీఆర్ టీం చాలా చురుగ్గా… స్పందించింది. ప్రధానమైన మీడియా సంస్థలన్నిటికీ నేరుగా సమాచారం పంపేశారు. చాలా పద్దతిగా చెప్పారు. దాంతో… ప్రధానమైన మీడియా సంస్థలు ఐటీ దాడుల విషయాన్ని చెప్పీచెప్పకుండా చెప్పి ఆపేశాయి. తర్వాత ఎక్కడా కవరేజీ లేదు. మేఘా కృష్ణారెడ్డి ఇటీవలి కాలంలో మీడియా రంగంలో పెట్టుబడులు పెట్టి ఉండవచ్చు కానీ.. కాంట్రాక్టర్‌గా ఆయన మొదటి నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియాతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు.
మేఘా ఇంజినీరింగ్ తరపున ఎలాంటి ప్రాజెక్ట్ ప్రారంభించినా… పనులు చేస్తున్నా… ప్రతి అకేషన్‌కు పెద్ద ఎత్తున ప్రకటనుల ఆయా పత్రికలు, టీవీ చానళ్లకు వస్తాయి. ప్రతీ పండుగకు ప్రత్యేకంగా మీడియాకు వాటి వాటి రేంజ్ లో ప్రకటనలు ఇస్తారు. ప్రకటనలు మాత్రమే కాదు.. మేఘా గ్రూప్‌కు ఇటీవలికాలంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాధినేతలతోనూ సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. దాంతో.. ఆయా ప్రభుత్వాలకు సన్నిహితంగా ఉండే మీడియా వర్గాలు.. ఐటీ సోదాలు గురించి రిపోర్ట్ చేయడానికి మొహమాటపడ్డాయి. అయితే.. ప్రభుత్వాలను తీవ్రంగా వ్యతిరేకించే మీడియా కూడా.. ఈ సారి సైలెన్స్ అవడం విచిత్రం. సాధారణంగా ఎవరిపైనైనా ఐటీ దాడులు జరిగితే.. మీడియా చేసే హడావుడి అలా ఇలా ఉండదు.
ఓ మామూలు ఉద్యోగిపై ఏసీబీ దాడులు జరిగితే.. లక్షలు.. కోట్లు అక్రమాస్తులు అంటూ.. హడావుడి చేస్తుంది. అలాంటి… దేశంలోనే అత్యంత సంపన్న కాంట్రాక్టర్లుగా ఎదిగిన వారిపై ఐటీ దాడులు జరిగితే.. మరింత హంగామా చేయాల్సి ఉంటుంది. వారిపై ఉన్న ఆరోపణలు అటువంటివి. కానీ… వెబ్ మీడియా తప్ప.. మెయిన్ స్ట్రీమ్ మీడియా… ఆ సంపన్నులకు ఎదురెళ్లడానికి సంకోచించింది. చివరికి వెబ్ మీడియాకు కూడా… మెగా నుంచి సూచనలు వచ్చినా… పట్టించుకోలేదు. వారు మాత్రం ధైర్యంగా… రిపోర్ట్ చేశారు.