విజయ్ దేవరకొండ నటించిన ‘డియర్ కామ్రేడ్’, ‘ఖుషి’ చిత్రాల తాలుకూ కమర్షియల్ రిజల్ట్ ఏమిటి? ఈ సినిమాల వల్ల నిర్మాతలు నష్టపోయారా, లాభపడ్డారా? ఈ లెక్కలన్నీ బయటకు రాబోతున్నాయి. విజయ్ దేవరకొండ ‘ది ఫ్యామిలీ స్టార్’ లెక్కలన్నీ అయిపోయిన తరవాత కూడా ఈ పాత సినిమాల విషయాలెందుకు? అనే కదా, డౌటు. అక్కడే ఉంది అసలు పాయింట్.
విజయ్ ‘ఫ్యామిలీస్టార్’ బాక్సాఫీసు దగ్గర డింకీ కొట్టింది. దిల్ రాజు ఆశలు, అంచనాలూ నీరుగారిపోయాయి. విజయ్ కెరీర్లో ఇది మరో ఫ్లాప్. అంత వరకూ ఓకే. అయితే.. విజయ్ గత సినిమాలు ‘డియర్ కామ్రేడ్’, ‘ఖుషి’ సినిమాలు కూడా నిర్మాతలకు నష్టాలనే మిగిల్చిందని, ఆ సినిమాల్ని కూడా డిజాస్టర్లుగా పేర్కొంటూ సోషల్ మీడియాలో ఓ వర్గం, కొన్ని వెబ్ సైట్లు విజయ్ దేవరకొండని టార్గెట్ చేస్తూ కథనాలు రాస్తున్నాయి. దీనిపై విజయ్ టీమ్ కాస్త అసహనంగా ఉంది. అందుకే ఈ రెండు చిత్రాల్నీ తెరకెక్కించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ పాత లెక్కల్ని బయటకు తీయబోతోందని సమాచారం. నిజానికి ‘డియర్ కామ్రేడ్’ నిర్మాతలకు టేబుల్ ప్రాఫిట్ మిగిల్చింది. కొన్ని చోట్ల బయ్యర్లు నష్టపోయినా, పెద్దగా ఇబ్బంది రాలేదు. ‘ఖుషి’ కూడా ఆర్థికంగా నిర్మాతలకు సంతృప్తినిచ్చిన సినిమానే. విజయ్‌తో మైత్రీ మూవీస్ గతంలో ఓ సినిమా సెట్స్‌పైకి తీసుకెళ్లింది. అది అర్థాంతరంగా ఆగిపోయింది. ఆ సినిమా స్థానంలోనే ‘ఖుషి’ మొదలైంది. గతంలో ఆగిపోయిన సినిమాకైన ఖర్చు కూడా ‘ఖుషి’ బడ్జెట్ లో కలిపేశారు. అయినా సరే.. ‘ఖుషి’ మైత్రీ మూవీస్‌కి టేబుల్ ప్రాఫిట్ మిగిల్చింది. కేవలం విజయ్ ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడానికే ‘డియర్ కామ్రేడ్’, ‘ఖుషి’ చిత్రాల్ని ఫ్లాపుల లిస్టులో చేరుస్తూ కథనాలు రాస్తున్నారని గ్రహించిన మైత్రీ మూవీస్ ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకొన్నట్టు ఇన్ సైడ్ వర్గాల టాక్. గతంలో నాని నటించిన ‘శ్యామ్ సింగరాయ్’, ‘హాయ్ నాన్న’ నిర్మాతలకు నష్టాలు మిగిల్చాయని వార్తలు వచ్చినప్పుడు ఆయా నిర్మాణ సంస్థలు స్పందించాయి. ఇప్పుడు మైత్రీ కూడా అదే చేస్తోంది.