హైదరాబాద్ పాతబస్తీ అంటే.. మజ్లిస్ పార్టీకి కంచుకోట. ఒకప్పుడు… మజ్లిస్ బచావో తహరిక్.. ఎంబీటీ నుంచి గట్టి పోటీ ఉండేది. కానీ ఆ పార్టీ నాయకత్వం బలహీనపడటంతో.. ఎంఐఎంకు ఎదురు లేకుండా పోయింది. ఏ పార్టీ అధికారంలో ఉంటే.. ఆ పార్టీకి దగ్గరగా వ్యవహరిస్తూ.. పాతబస్తీలో ఇతర పార్టీలు బలపడకుండా… ఓవైసీ బ్రదర్స్ చూసుకుంటున్నారు. ఈ సారి కూడా.. ఆ పార్టీకి ఏడు స్థానాలు ఖాయమని ఇప్పటికే అందరూ డిసైడైపోయాయి. కానీ రెండు, మూడు నియోజకవర్గాల్లో వారు అనుకున్నంతగా… సానుకూలత లేదన్న విశ్లేషణలు కూడా వస్తున్నాయి
ప్రతిపక్షాలు బలపడుతుండడం, స్థానికంగా గుర్తింపు పొందిన వారినే ప్రత్యర్థులు అభ్యర్థులుగా నిలబెడుతుండడంతో ఈ సారి సమీకరణాలు మారుతున్నాయి. మజ్లిస్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీట్లు ఇచ్చారు కానీ.. రెండు, మూడు చోట్ల స్థానాల మార్పు చేశారు. మజ్లిస్‌కు వ్యతిరేకంగా ప్రచారం అంటేనే భయపడే ఇతర పార్టీల నేతలు ఇప్పుడు ఢీ అంటే ఢీ అంటున్నారు. దశాబ్దాలు గడిచినా జరగని అభివృద్ధి, నిరక్షరాస్యత, ఇప్పటికీ చాలా కుటుంబాలు దారిద్య్ర రేఖకు దిగువన ఉండటం, మెట్రోరైలు రాకపోవడం లాంటి అంశాలను ప్రతిపక్షాలు ప్రచారాంశాలుగా మార్చుకోవడం మజ్లిస్‌కు ఇబ్బందికరంగా మారతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎంఐఎం పార్టీ గుప్పిట్లో ఉన్న చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా, బహదూర్‌పురాతో పాటు వరస విజయాలతో కైవసం చేసుకుంటున్న కార్వాన్ నియోజకవర్గం, నాంపల్లి, మలక్‌పేట నియోజకవర్గాల్లో ఈ సారి కూడా హవా కొనసాగించాలని మజ్లిస్ భావిస్తోంది. ముస్లింలు అత్యధికంగా ఉన్న పాతబస్తీలో ముస్లిం పార్టీగా గుర్తింపు పొందడంతో పాటు వారసత్వంగా వస్తున్న మజ్లిస్ నేతలకు ఉన్న క్రేజ్ ఇప్పటికీ కొనసాగే అవకాశముంది. అదే ఊపు కొనసాగిస్తే ఈ 7 సీట్లతో పాటు కొత్తగా అభ్యర్థిని దింపుతున్న రాజేంద్రనగర్ సీటుపై కూడా మజ్లిస్ కన్నేసింది.
చాంద్రాయణగుట్ట నియోజకవర్గం నుంచి అక్బరుద్దీన్ ఒవైసీ బరిలోకి దిగుతున్నారు. ఇక్కడ మజ్లిస్‌కు తిరుగులేదని చెప్పుకోవచ్చు. పక్కనే ఉన్న బహదూర్‌పురా నియోజకవర్గం ప్రారంభమైనప్పటి నుంచి ఓటర్లు మజ్లిస్‌ను ఆదరిస్తూ వచ్చారు. బహదూర్‌పురా ఎమ్మెల్యేగా మొజంఖాన్ అందుబాటులో ఉండరన్న విమర్శ ఉంది. చార్మినార్ ఎమ్మెల్యేగా సుదీర్ఘంగా విజయం సాధిస్తూ వచ్చిన అహ్మద్ పాషా ఖాద్రీ ఈ సారి యాకుత్‌పురా నుంచి పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం చార్మినార్ నుంచి పోటీ చేస్తున్న ముంతాజ్ అహ్మద్ ఖాన్ గతంలో యాకుత్‌పురా ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ సారి చార్మినార్ నుంచి మహా కూటమి అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ గౌస్ పేరు ఖరారు కావడంతో ఆ నియోజకవర్గంలో వేడి పుట్టింది. గతంలో మజ్లిస్ నాయకుడు అయిన గౌస్.. ఓవైసీ బ్రదర్స్‌తో విబేధించి.. బయటకు వచ్చారు. గత ఎన్నికలతో పోలిస్తే కాస్త బలం పుంజుకున్న ఎంబీటీతో ఈ సారి గట్టి పోటీ తప్పదు.
ఇక మలక్‌పేట్‌లో మహా కూటమి ఏర్పాటు కారణంగా టీడీపీ అభ్యర్థి ముజఫర్ పోటీ చేస్తుండటంతో ఆ సీటుపై కూడా మజ్లిస్ భారీ కసరత్తు చేయాల్సిందే. అక్కడ హిందూ ఓట్లు కూడా.. ముస్లింలతో సమానంగా ఉన్నాయి. కానీ ప్రతీ సారి ముస్లిం ఓటింగ్ ఎక్కువగా నమోదవుతూండటంతో… ఎంఐఎం బయటపడుతోంది. ఈ సారి… ముస్లింలలోనూ పట్టు పెంచుకునేందుకు ముజఫర్ ప్రయత్నం చేస్తున్నారు. నాంపల్లి సీటు అంత ఈజీ కాదని గత ఎన్నికల అనుభవం నుంచే మజ్లిస్ గుర్తించింది. సమాజసేవ చేస్తూ బాగా గుర్తింపు పొందిన స్థానిక కాంగ్రెస్ నేత ఫెరోజ్ బరిలోకి దిగడంతో పాటు మహాకూటమి బలపరుస్తుండటం ఈ సీటుపై పట్టు సాధించడానికి ఏం ప్రయత్నాలు చేస్తుందో చూడాల్సిందే. కార్వాన్లో ఎంఐఎంతో పాటు బీజేపీ కూడా కాస్త బలంగా ఉండటంతో అక్కడ మహాకూటమి అంతగా ప్రభావం చూపకపోవచ్చని భావిస్తున్నారు. ఒకవేళ మహాకూటమి అభ్యర్థి మైనార్టీ ఓట్లను చీలిస్తే ఇక్కడ బీజేపీ అభ్యరికి లాభం చేకూరే అవకాశాలున్నాయి.