చదివింది… ఎంబీఏ
కన్స్ట్రక్షన్ వ్యాపారంలో అపారమైన అనుభవం వుంది.
అక్కడ ఆయన లైఫ్ సెటిల్. ఏసీ రూములు కాలుమీద కాలేసుకుని కూర్చుని – వ్యాపారం నడిపించేయొచ్చు.
కానీ.. సినిమాలపై అభిరుచితో ఈ రంగంలోకి అడగుపెట్టారు.
తొలి సినిమా ఫ్లాప్ అయ్యింది.
రెండో సినిమా విడుదలకు ముందూ సమస్యలే.
సడన్‌గా మ్యూజిక్ డైరెక్టర్ హ్యాండిచ్చే – `ఈ సినిమా నేను చేయలేను` అనేసరికి విడుదల తేదీ సందిగ్థంలో పడింది.
పైగా టాలీవుడ్ హిట్లకు కరువాచిపోయి, వచ్చిన సినిమా వచ్చినట్టే వెనక్కి వెళ్లిపోతున్న తరుణం.. ఎన్నికల సీజన్, ఐపీఎల్ వేడి – వీటి మధ్య చెప్పిన సమయానికి సినిమాని విడుదల చేయడం కష్టమైన తరుణం. ఈ గండాలన్నీ ధైర్యంగా, మెండిగా దాటేసి `మజిలీ`ని విజయతీరాలకు చేర్చారు నిర్మాతలలో ఒకరైన సాహు గారపాటి. ‘ మజిలీ` రూ.50 కోట్ల గ్రాస్ మైలురాయిని అందుకున్న సందర్భంలో సాహుతో తెలుగు 360 ప్రత్యేకంగా మాట్లాడింది.
హలో అండీ… కంగ్రాట్స్..
థ్యాంక్సండీ…
మరో సినిమా చిత్రలహరి వచ్చినా.. మీ వసూళ్లకు ఢోకా లేనట్టుంది..
అవునండీ. కలక్షన్లు స్డడీగా ఉన్నాయి. తొలి రోజే… మంచి టాక్ రావడం, ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా విపరీతంగా నచ్చడం బాగా కలిసొచ్చింది. ప్రొడక్ట్ పట్ల మేం చాలా హ్యాపీగా ఉన్నాం.
అసలు మీ నేపథ్యం ఏమిటి? సినిమా రంగం వైపు రావడానికి గల కారణమేంటి?
మాది విజయవాడ. దుబాయ్‌లో ఎంబీఏ పూర్తి చేశాను. కన్స్ట్రక్షన్ బిజినెస్ ఉంది. అందులో చాలా బిజీ. అయితే సినిమాలంటే ఇష్టం. మైత్రీ మూవీస్, యూవీ క్రియేషన్స్, దిల్‌రాజుగారు… వీళ్లంతా బాగా తెలుసు. అందుకే ఈ రంగంవైపు నేనూ రావాలనుకున్నాను. అయితే ఇంట్లోవాళ్లని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. సినిమా అంటే రిస్క్‌తో కూడుకున్న వ్యాపారం. కోట్లకు కోట్లు అడిగితే… ఇంట్లో ఇవ్వరు. అందుకే ఈ వ్యాపారంలో పెట్టే ప్రతీ రూపాయి నాదై ఉండాలనుకున్నాను.
ఇంట్లో సినీ పరిశ్రమకు చెందినవాళ్లెవరూ లేరా?
లేరండీ. కానీ మా నాన్నగారు దూరదర్శన్‌లో ఓ డైలీ సీరియల్‌ని ప్రొడ్యూస్ చేశారు. ఆ అనుభవం అయితే ఉంది.
తొలి సినిమా కృష్ణార్జున యుద్ధం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దాంతో నిరుత్సాహానికి గురయ్యారా?
ఓ విధంగా బాగా ఇబ్బంది పెట్టింది. ఎందుకంటే.. నాని అప్పటికి సూపర్ ఫామ్‌లో ఉన్నారు. ఆయన సినిమా అంటే హిట్టే అని ఫిక్సయిపోయేంత రేంజ్. గాంధీకి కూడా రెండు వరుస హిట్లు ఉన్నాయి. కాబట్టి.. ఆ సినిమా తప్పకుండా ఆడుతుందనిపించింది. అయితే తొలి సినిమాతోనే పరాజయం రావడం ఓ విధంగా మంచిదే అయ్యింది. ఆ అనుభవం తొలి అడుగులోనే తెలుసుకోగలిగాను. వరుసగా హిట్లు కొట్టి, ఓ ఫ్లాప్ వస్తే.. తీసుకోవడం మరింత కష్టమయ్యేదేమో.
`నిన్ను కోరి` చూసిన వెంటనే శివకి అడ్వాన్స్ ఇచ్చారా?
కాదండీ. నిజానికి శివగారు… కోన వెంకట్‌కి ఓ సినిమా చేయాలి. ఆయన ఓ హీరోని సెట్ చేసుకున్నారు. కానీ శివ నిర్వాణకు నాగచైతన్యతో సినిమా చేయాలని ఉండేది. ఓ లైన్ చెప్పి చైతూకి వినిపించారు. అది చైతూకి బాగా నచ్చింది. దాంతో.. కోన వెంకట్‌గారి అనుమతితో శివ నిర్వాణ రెండో సినిమా మా సంస్థలో చేశాం.
మూడో సినిమా కూడా మీతోనేనట..?!
అవును. విజయ్‌దేవరకొండతో ఓ సినిమా అనుకుంటున్నాం. వచ్చే నెలలో కథ చెప్పబోతున్నాం. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. మా సంస్థలో మూడో సినిమా వీరిద్దరి కాంబినేషన్లో ఉంటుంది.
మజిలీ విడుదలకు ముందు కొన్ని విపత్కర పరిస్థితులు వచ్చాయి. సంగీత దర్శకుడు గోపీ సుందర్ చేతులు ఎత్తేశాడు. ఈ పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేశారు?
నిజంగా అది షాకింగ్ విషయం. ఏప్రిల్ 5న మేం సినిమా రిలీజ్ చేయాలనుకున్నాం. మార్చి 15 నాటికైనా ఆర్.ఆర్. పూర్తి చేయాలి. కానీ.. అప్పటికి ఒక్క రీల్ కూడా పంపలేదు. అసలు గోపీ సుందర్ మా సినిమాకి పని చేస్తున్నాడో, లేదో అర్థం కాలేదు. `మార్చి 25 నాటికి పని పూర్తి చేస్తా` అన్నాడు. అప్పటికి సినిమా పూర్తవ్వకపోతే మా పరిస్థితి ఏమిటి? అనే భయం వేసింది. అందుకే అప్పటికప్పుడు తమన్‌ని సంప్రదించాం. తమన్‌కి మా సినిమా బాగా నచ్చింది. అందుకే ఆర్.ఆర్ చేయడానికి ముందుకొచ్చాడు. తను ప్రాణం పెట్టి పనిచేశాడు. అందుకే అవుట్‌పుట్ అంత బాగా వచ్చింది.
గోపీ సుందర్ విషయంలో తప్పెవరిది?
పూర్తిగా తనదే. మాకెలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా సినిమా పని ఆపేశాడు. తన పర్సనల్ ఇబ్బందులు తనకు ఉండొచ్చు. ఇన్ని కోట్లతో ముడిపడిన వ్యాపారం ఇది. అలా అర్థాంతరంగా చేతులెత్తేస్తే ఎలా?
ఈ విషయమై మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు?
ఛాంబర్లో ఫిర్యాదు ఇవ్వాలనుకుంటున్నాం. సినిమా విడుదలకు ముందే ఈ పని చేయొచ్చు. కానీ.. మా సినిమాపై ఓ నెగిటీవ్ ఇంప్రెషన్ పడే ప్రమాదం ఉంది. ఈ సినిమా గురించి జనం రకరకాలుగా మాట్లాడుకునే అవకాశం ఇచ్చినవాళ్లం అవుతాం. అందుకే ఇన్ని రోజులు ఆగాం.
గోపీకి ఇవ్వాల్సిన పారితోషికం పూర్తిగా ఇచ్చేశారా?
మొత్తం ఇచ్చేశాం. గోపీ వెళ్లిపోవడం వల్ల తమన్‌కీ పారితోషికం ఇచ్చి పనిచేయించుకోవాల్సివచ్చింది కదా?
చై- సమంత జంటే ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ అయ్యింది. ఒకవేళ సమంత ఈ సినిమాలో చేయను అంటే మీ దగ్గర వేరే ఆప్షన్ ఉందా?
కచ్చితంగా లేదు. సమంత మాత్రమే ఈ పాత్ర చేయగలరు అనిపించింది. ఎందుకంటే.. చై – సమంత పాత్రల్ని రెండు ఛాయల్లో, రెండు వయసుల్లో చూపించాలి. రెండు దశల్లోనూ వాళ్ల కెమిస్ట్రీ వర్కవుట్ అవ్వాలి. వాళ్లు భార్యాభర్తలంటే నమ్మేలా ఉండాలి. వాళ్లు ఒప్పుకోవడంతోనే ఈ సినిమా హిట్టు కొట్టినంత ఆనందం అనిపించింది. సమంత తొలి సిట్టింగ్‌లో ఈ కథని ఓకే చేయలేదు. రెండోసారి… ఇంకొంత వివరంగా స్క్రిప్టు వినిపించడంతో ఓకే అన్నారు.
చైతూ మాటేంటి?
చైతూ రెండు గెటప్పులు బాగా కుదిరాయి. రామ్ చరణ్‌కి రంగస్థలం ఎలా మైలురాయిగా నిలిచిపోయిందో, చైతూకి మజిలీ అలా ఉండిపోతుందన్నది నా ప్రగాఢ విశ్వాసం. ఈ విషయమే తనకీ చెప్పాను. ఈ కథని, పూర్ణ పాత్రనీ తాను బాగా నమ్మాడు. అందుకే అంత సహజంగా నటించాడు. ఈ సినిమాలో నైట్ షూట్లు ఎక్కువ. క్రౌడ్లోనూ చేశాం. సాధారణంగా చై నైట్ షూట్లకు ఒప్పుకోడు. క్రౌడ్‌లో కనిపించడం పెద్దగా ఇష్టం ఉండదు. ఇండ్రస్ట్రీలో కొంతమంది.. `చై రాత్రిళ్లు షూటింగ్ చేయడు.. పొద్దుటే షూటింగ్‌కి రాడు.` అంటూ చాలారకాలుగా చెప్పి భయపెట్టారు. కానీ చై చాలా డెడికేటెడ్. మేం కూడా అలానే ఉండేవాళ్లం. ఉదయం నాలుగింటకి షూటింగ్ అని చెబితే.. మేం మూడింటికే ఉండేవాళ్లం.
సినిమా విషయంలో నాగ్ జోక్యం ఎంత?
ఈ సినిమా విషయంలో ఆయన జోక్యం ఏమాత్రం లేదు. రషెష్ చూసింది కూడా లేదు. సినిమా ఆర్.ఆర్తో సహా పూర్తయ్యాకే ఆయనకి చూపించాం. చాలా బాగా తీశారు.. మేం కూడా ఇంత గ్రాండ్‌గా తీయలేమేమో అన్నారు. ఆ మాట చాలా సంతోషాన్ని ఇచ్చింది. సమంత, చైతూ అయితే చాలా హ్యాపీ. `మీరు ఎప్పుడు సినిమా చేయమన్నా చేస్తాం..` అని మాటిచ్చారు.
విడుదలకు ముందే పంపిణీదారులందరికీ చూపించేశారు. మీ నమ్మకం ఏమిటి?
ఈ కథ విన్నప్పుడే రెండుమూడు సార్లు కళ్లలో నీళ్లు తిరిగాయి. సినిమా చూసినప్పుడు మరింత ఎమోషన్ అవ్వడం గ్యారెంటీ అనిపించింది. సినిమా తీస్తున్నప్పుడు ఎప్పుడూ ఒక్క డౌటు కూడా రాలేదు. అందుకే అంత నమ్మకంతో ఉన్నాను. ఈ సినిమా దిల్ రాజుగారు చూసి `సినిమా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారు. మరి యూత్ సంగతి ఏమిటో తెలీదు` అన్నారు. `ఈ సినిమా హిట్టు పక్కాసార్..` అని చెప్పేవాడ్ని. నా నమ్మకానికి ఆయన ఆశ్చర్యపోయారు. విడుదలైన తొలి రోజు చూసి.. `నీ నమ్మకం నిజమైంది. చైతూ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ ఇది..` అన్నారు.
సోలోగా సినిమాలు తీసే సత్తా ఉంది. మరి భాగస్వామ్యం ఎందుకు?
హరిష్ పెద్ది నా స్నేహితుడు. తనకీ నాలా సినిమాలపై చాలా ఫ్యాషన్ ఉంది. ప్రొడక్షన్ కి సంబంధించిన పనులన్నీ తాను చూసుకుంటాడు. బిజినెస్ వ్యవహరాలు నేను చూసుకుంటుంటా.
కమర్షియల్ సినిమాలతో ప్రయాణం చేస్తారా? లేదంటే కొత్త తరహా కథల్నీ ఎంచుకుంటారా?
మజిలీ ఏం ఫక్తు కమర్షియల్ సినిమా కాదు. పూర్ణ అనే ఓ కుర్రాడి కథ. ఆ కథని ఎలా చెప్పాలో అలా చెప్పాం. అందుకే ఇంత మంచి విజయాన్ని సాధించింది. మా సంస్థలో కథకు ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేయాలనివుంది.
కొత్త దర్శకులకు ఛాన్స్ ఇస్తారా?
తప్పకుండా. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు కథలు వినిపించారు. ఆ కథలూ బాగున్నాయి. అయితే ప్రస్తుతం హీరోలు… పెద్ద దర్శకులవైపు దృష్టి పెడుతున్నారు.
మీ భవిష్యత్తు ప్రణాళికలేంటి?
అందరు దర్శకులు, అందరు హీరోలతో పనిచేయాలని ఉంది. కానీ.. చక చక సినిమాలు తీసుకుంటూ వెళ్లడం ఇష్టం లేదు. ఓ హిట్టు వచ్చింది కదా.. అని కాంబినేషన్‌ని సెట్ చేసి సినిమాల్ని పూర్తి చేయలేను. `ఇలాంటి సమయంలోనే నిదానంగా ఆలోచించి, మంచి నిర్ణయాలు తీసుకోండి` అని దిల్‌రాజుగారు గట్టిగా చెప్పారు. రెండో సినిమా హిట్టయ్యింది కాబట్టి, మూడోసారి మరింత మంచి సినిమా తీయాలని, ఇండ్రస్ట్రీలో పది కాలాల పాటు ఉండాలన్న కృత నిశ్చయంతో ఉన్నాం.
ఆల్ ది బెస్ట్
– థ్యాంక్సండీ..!