హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో కొన్ని దశాబ్దాలుగా మజ్లిస్ పార్టీ నిర్ణయాత్మకశక్తిగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇవాళ్టి ఫలితాలతో మజ్లిస్‌కు ఉన్న ఆ ఆధిపత్యానికి గండి పడింది. మేయర్ పీఠాన్ని ఎవరు చేజిక్కించుకున్నా మజ్లిస్ పార్టీ పొత్తు అవసరమయ్యే గత పరిస్థితులకు విరుద్ధంగా గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఒంటరిగానే విజయం చేజిక్కించుకుని సంచలనం సృష్టించింది. మజ్లిస్ పార్టీ గతంలో 40-50 స్థానాలు సాధిస్తూ వస్తుండేది. అయితే తాజా ఎన్నికల్లో కేవలం 30 స్థానాలతో సరిపెట్టుకోవాల్సివచ్చింది. దీనితో మజ్లిస్ మనుగడ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. పేరుకు ముస్లిమ్‌లకు ప్రతినిధి పార్టీగా చెప్పుకుంటూ వస్తున్నప్పటికీ, ఆ వర్గానికి మజ్లిస్ ఒరగబెట్టిందేమీలేదని పాతబస్తీ ముస్లిమ్లే చెబుతారు. తాజా ఫలితాలు ఓవైసీ సోదరులకు చెంపపెట్టులాంటిదేనని చెప్పాలి. ఒకవైపు దేశవ్యాప్తంగా విస్తరిద్దామని ప్రణాళికలు రచించుకుంటూ వారు బీహార్, యూపీ, మహారాష్ట్రలలో పర్యటిస్తుండగా, సొంత చోట తగిలిన దెబ్బ ఓవైసీల పరువు తీసేసినట్లుగానే ఉంది. ఇదిలా ఉంటే నగర బీజేపీ నాయకులు ఈ ఎన్నికల్లో తాము ఓడిపోయినాకూడా, మజ్లిస్ పార్టీ నుంచి హైదరాబాద్ నగరానికి విముక్తి కలిగిందని సంబరాలు చేసుకుంటున్నారు.