మజ్లిస్ ఎమ్మెల్యేలు ఏడుగురు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం అయ్యారు. సెక్రటేరియట్‌కు అక్బరుద్దీన్ సారధ్యంలో వచ్చిన ఎమ్మెల్యేలు.. పలు అంశాలపై చర్చించారు. పాతబస్తీ, మూసీ అభివృద్ధి తదితర అంశాలపై చర్చించినట్లుగా చెబుతున్నారు. కానీ అసలు విషయం పరిచయాలు పెంచుకోవడం అని రాజకీయవర్గాలకు తెలుసు. ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ను ప్రభుత్వం ఎంపిక చేసుకోవడంపై విమర్శలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి బొటాబొటి మెజార్టీ ఉండటం వల్ల మజ్లిస్ తో సన్నిహిత సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నారని బీజేపీ ఆరోపించింది.
కారణం ఏమైనప్పటికీ అక్బరుద్దీన్ రెండు, మూడు రోజుల్లోనే తన ఎమ్మెల్యేలందరితో కలిసి రేవంత్ రెడ్డితో సమావేశం కావడం రాజకీయవర్గాలను కూడా ఆశ్చర్య పరుస్తోంది. కాంగ్రెస్ పార్టీతో చాలా కాలంగా మజ్లిస్ విబేధిస్తోంది. జాతీయ రాజకీయాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఓటమి కోసం ప్రయత్నిస్తోంది. తెలంగాణలోనూ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మజ్లిస్ రాజకీయం చేసింది. బీఆర్ఎస్ పార్టీకి బహిరంగంగా మద్దతు తెలిపింది. అయితే మజ్లిస్ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో సన్నిహితంగా ఉంటుంది. అధికార పార్టీలతో గొడవలు పెట్టుకోవాలనుకోదు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పాత విషయాలు మర్చిపోయి.. మళ్లీ కాంగ్రెస్ కు దగ్గరవుతున్న సూచనలు కనిపిస్తున్నాయంటున్నారు.
కాంగ్రెస్ పార్టీకి సాధారణ మెజార్టీ కంటే.. నాలుగు సీట్లే ఎక్కువగా ఉన్నాయి. అందుకే్ మజ్లిస్ కు చెందిన ఏడుగురు బలం కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. నేరుగా మద్దతు ఇవ్వకపోయినా ప్రభుత్వం వైపు ఉంటారన్న సందేశం పంపితే చాలన్నట్లుగా కాంగ్రెస్ భావిస్తోంది.