తెలంగాణ ఏర్పడిన తరవాత… టాలీవుడ్‌కి ప్రభుత్వం తరపున ఎలాంటి భరోసా రాలేదు. చిత్రసీమవైపు కేసీఆర్ పెద్దగా దృష్టి సారించడం లేదన్న విమర్శ వుంది. పైగా రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాల ప్రదానాన్నీ ప్రభుత్వం లైట్ తీసుకొంది. అయితే గత కొంతకాలంగా టాలీవుడ్ బాగోగులపై ప్రభుత్వం ఫోకస్ చేయడం మొదలెట్టింది. ఈ నేపథ్యంలో ఇటీవల చిరంజీవి ఇంట్లో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌తో చర్చలు జరిగాయి. ఇప్పుడు అన్నపూర్ణ స్డూడియోస్‌లో మరోమారు మంత్రితో చర్చలు జరిపారు. చిరంజీవి, నాగార్జునతో సహా ప్రభుత్వ అధికారులు ఇందులో పాలుపంచుకున్నారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరపున మంత్రి కొన్ని ప్రపోజల్స్ తీసుకొచ్చారు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్థాపన కోసం శంషాబాద్ పరిసరాల్లో స్థలం సేకరించాలని అధికారుల్ని మంత్రి ఆదేశించారు. సినీ, టీవీ కళాకారులకు ఇళ్ల నిర్మాణం కోసం పది ఎకరాలు కేటాయిస్తామని మంత్రి ప్రకటించారు. అందుకు సంబంధించిన స్థలాన్ని సేకరించాలని ఆయన అధికారుల్ని ఆదేశించారు. సింగిల్ విండో విధానం ద్వారా షూటింగులకు అనుమతులు ఇవ్వడానికి మంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. చిత్రసీమని వెంటాడుతున్న పైరసీ నివారణకూ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి ప్రకటించారు. త్వరలో చిత్రసీమలోని పెద్దలతో మరోసారి మంత్రి భేటీ అవుతారని తెలుస్తోంది. ఆ తరవాత… అధికారికంగా మరిన్ని కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది.