భారత అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2024 ఏడాదికి గాను నలుగురు క్రీడాకారులను ఖేల్‌రత్న పురస్కారాలకు ఎంపిక చేసింది. 32మందికి అర్జున, ఐదుగురికి ద్రోణాచార్య పురస్కారాలకు ఎంపిక చేశారు.
ఒకే ఒలింపిక్ గేమ్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి అథ్లెట్‌గా చరిత్ర సృష్టించి మను బాకర్, ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించిన గుకేశ్ ఖేల్ రత్న అవార్డ్ అందుకోనున్నారు.
అలాగే ఒలింపిక్స్‌లో వరుసగా భారత్ రెండో పతకం సాధించడంలో కీలక పాత్ర పోషించిన హాకీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, పారాలింపిక్స్ హై జంప్ లో సత్తా చాటిన ప్రవీణ్ కుమార్ లని ఖేల్‌రత్న అవార్డులతో గౌరవించనుంది ప్రభుత్వం.
జనవరి 17న రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసే ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా వీరంతా పురస్కారాలను అందుకోనున్నారు.