ఆర్మీ ఆయుధ డిపోలో పెను విషాదం. మహారాష్ట్ర వార్ధా సమీపంలోని పుల్గావ్ ఆయుధ గిడ్డంగిలో భారీ పేలుడు, ఆ తర్వాత అగ్ని ప్రమాదం సంభవించడంతో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఇద్దరు ఆర్మీ అధికారులు. 13 మంది అగ్ని మాపక సిబ్బంది. ఈ ఘటనలో 17 మంది జవాన్లు గాయపడ్డారు. పటిష్టమైన భద్రత ఉండే ఆయుధ డిపోలో జరిగిన ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పేలుడుకు కుట్ర జరిగి ఉంటుందా అని పలువురు అనుమానిస్తున్నారు.
సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత, ఒంటి గంట, 2 గంటల మధ్య ఈ ఘటన జరిగింది. మొదట భారీ విస్ఫోటనం సంభవించినట్టు ఆర్మీ అధికారులు తెలిపారు. దాంతో ఒక్కసారిగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. మంటలు డిపోమొత్తం వ్యాపించడంతో హుటాహుటిన అగ్నిమాపక దళాన్ని రంగంలోకి దింపారు. మంటలు ఎక్కువగా వ్యాపించకుండా ప్రయత్నించిన సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు. వారి త్యాగం వల్లే ఇంకా పెను ప్రమాదం తప్పిందని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ చెప్పారు. ముందు జాగ్రత్తగా డిపో సమీపంలోని కాలనీలు, గ్రామాల ప్రజలను అక్కడి నుంచి తరలించారు. దాదాపు 20 ఫైరింజన్లతో సిబ్బంది గంటల తరబడి ప్రయత్నించిన తర్వాత మంటలు పూర్తిగా చల్లారాయి.
భారత్ పైకి ఉగ్రవాదాన్ని అస్త్రంగా ప్రయోగిస్తున్న పాకిస్తాన్, ఇంకా అనేక కుట్రలు పన్నుతోంది. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు నేరుగా దాడి చేశారు. భారత్ లో ఉగ్రదాడులు కొత్త కాదు. అయితే, పుల్గావ్ ఆర్మీ ఆయుధ డిపో అత్యంత సురక్షితమైందని పేరుంది. మన దేశంలో అతిపెద్ద ఆయుధ డిపో. ఆసియాలో రెండో అతిపెద్దది. అక్కడ ఆయుధాలను జాగ్రత్తగా నిల్వచేస్తారు. పొరపాటున పేలడానికి అవకాశం లేకుండా సకల జాగ్రత్తలూ తీసుకుంటారు. ఆయుధాలను కంటికి రెప్పలా కాపాడతారు.
కాబట్టి ఏదో చిన్న కారణానికే పేలుడు, అగ్ని ప్రమాదం సంభవించాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ ఘటనలో కుట్ర కోణాన్ని కొట్టి పారేయలేమని ఆర్మీ అధికారులు చెప్తున్నారు. కారణం ఏమిటనే దానిపై విచారణకు ఆదేశించారు.
ఒక వేళ ఇది ప్రమాదమే అయితే, ఆయుధ సంరక్షణ విషయంలో ఇంకా అప్రమత్తత అవసరం అనే విషయానికి ఇది సూచిక. మనది పెద్ద దేశం. దేశీయ అవసరాల కోసం, సరిహద్దులను కాపాడటానికి, శత్రువులను ఎదుర్కోవడానికి పెద్ద ఎత్తున ఆయుధాలను తయారు చేసుకున్నాం. వాటిని రకరకాల ప్రదేశాల్లో రహస్యంగా నిల్వచేసి ఉంచాం. ఏమరుపాటువల్లో మరో కారణం వల్లో ఇలా ప్రమాదం జరిగితే అనర్థాలు తప్పవు. అలాగే అణ్వాయుధాల భద్రత మరింత ముఖ్యం.