26/11 ముంబై పై ఉగ్రదాడి. దేశం ఉలిక్కిపడిన ఘటన అది. మన దేశ భద్రతా దళాల పని తీరుని, నిఘా వ్యవస్థలోని డొల్లతనాన్ని ప్రశ్నించింది ఈ ఉగ్ర చొరబాటు. అదే సమయంలో దేశ రక్షణ కోసం వెన్ను చూపని వీరులు మనకూ ఉన్నారని ఎలుగెత్తి చాటింది. ఈ దాడిలో ఎంతోమంది ప్రాణాల్ని కోల్పోయారు. వాళ్లని ఈ దేశం ఇప్పటికీ స్మరించుకుంటూనే ఉంది. అలాంటి వారిలో.. `మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్` ఒకరు. 31 ఏళ్ల వయసులోనే… అశువులు బాసి, అమరుడయ్యాడు. ఈ దేశం అశోక చక్ర బిరుదుతో ఘనంగా నివాళి అర్పించింది. సందీప్ గురించి కథలు కథలుగా చెప్పుకుంటూనే ఉన్నారు జనాలు. అందుకే ఈ కథ `బయోపిక్` తీయడానికి ముడిసరుకుగానూ మారింది. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన ఓ సైనికుడి కథ కంటే గొప్ప ఉద్వేగం ఏముంటుంది? అందుకే `మేజర్` గురించి సర్వత్రా ఆసక్తి నెలకొంది. మహేష్ బాబు లాంటి స్టార్ అండదండలు ఈ సినిమాకి ఉండడం, వరుసగా కొత్త తరహా చిత్రాలు చేస్తూ వస్తున్న అడవిశేష్.. కథానాయకుడిగా నటించడంతో మరింత ఫోకస్ పెరిగింది. మరి.. ఈ `మేజర్` పంచిన ఉద్వేగం ఎలాంటిది? వెండితెరపై `మేజర్` ప్రయాణం ఎలా సాగింది?
Story :
చిన్నప్పటి నుంచీ సైన్యంలో చేరాలన్న తపనతో బతుకుతుంటాడు సందీప్ ఉన్ని కృష్ణన్ (అడవిశేష్). అమ్మ (రేవతి), నాన్న (ప్రకాష్‌రాజ్) అంటే ప్రాణం. వారిద్దరికీ సందీప్ సైన్యంలో వెళ్లడం ఇష్టం ఉండదు. కానీ… కొడుకు ఆలోచనలకు, ఆశయానికీ అడ్డు చెప్పలేకపోతారు. స్కూలు రోజుల్లో ఇష్ట పడిన నేహా (సయీ మంజ్రేకర్)ని పెళ్లి చేసుకుంటాడు. తనకెప్పుడూ టైమ్ కేటాయించడం లేదని నేహా ఎప్పుడూ ఫిర్యాదు చేస్తుంటుంది. కానీ సందీప్‌కి మాత్రం ఇల్లు, కుటుంబం కంటే దేశమే ఎక్కువ. అందుకే… నేహాతో విబేధాలు మొదలవుతాయి. మరోవైపు.. సైన్యంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకొంటాడు సందీప్. ఎన్.ఎస్.జీ కమాండోలకు శిక్షణ ఇచ్చే స్థాయికి చేరుకుంటాడు. విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రాణాలకు తెగించి బరిలోకి దిగే.. `51 ఎస్.ఏ.జీ` బృందానికి సారథ్యం వహిస్తాడు. అదే సమయంలో… ముంబైలో ఉగ్రదాడి జరుగుతుంది. ఉగ్రమూక ఆట కట్టించడానికి మేజర్ సందీప్ కూడా బరిలోకి దిగుతాడు. ఆ పోరులో మేజర్ ఏం చేశాడు? తాజ్ హోటెల్ బంధీలుగా ఉన్న ప్రజల్ని ఎలా కాపాడాడు? అందుకోసం తన ప్రాణాల్ని ఎలా పణంగా పెట్టాడు? అనేదే `మేజర్` కథ.
Analysis :
మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ అంటే.. ముంబైలో జరిగిన దాడులే గుర్తుకొస్తాయి. అయితే.. అంతకు ముందు తనకంటూ ఓ జీవితం ఉంది. దాన్ని.. ఈ కథలో చెప్పడానికి, చూపించడానికి చిత్రబృందం ప్రయత్నించింది. సందీప్ బాల్యం ఎలా గడిచింది? ఆర్మీలో చేరాలన్న ఆలోచన ఎలా వచ్చింది? యవ్వనంలో ఉన్న ప్రేమకథేంటి? ఇంట్లోవాళ్లపై తనకున్న ప్రేమ… శిక్షణలో తను తనని మార్చుకొని ఎదిగిన వైనం.. ఇవన్నీ కళ్లకు కట్టినట్టు చూపించారు. ముంబై ఉగ్రదాడిని ద్వితీయార్థానికి పరిమితం చేసి, ప్రధమార్థం మిగిలిన విషయాల్ని చెప్పడానికి ప్రయత్నించారు. బాల్యంలోని సంగతులు హృద్యంగా సాగుతాయి. ప్రేమకథని కూడా చాలా రొమాంటిక్ గా తీశారు. పేజర్ నెంబర్ చెప్పమంటే… ఒకొక్క నెంబర్ చెబుతూ ఉండడం, నేహాలోని ఒంటరితనాన్ని దూరం చేయడానికి చేసే ప్రయత్నాలు, ఎదురింటి ఆంటీ గొడవల్లో.. సందీప్ తలదూర్చడం… ఇలా ప్రతీ ఎపిసోడ్‌లోనూ ఏదో ఓ విషయం చెప్పడానికి ప్రయత్నించారు. `సోల్జర్` అంటే అర్థం ఏమిటని అడిగినప్పుడు.. సమాధానంచెప్పడానికి సందీప్ పడిన సంఘర్షణ, `నిజమైన సోల్జర్లా బతికి చూపిస్తా` అని కమాండర్‌కి మాట ఇవ్వడం.. ఇవన్నీ ఉద్వేగాన్ని కలిగిస్తాయి. అయితే అందరి దృష్టీ.. ముంబైలో దాడి జరిగినప్పుడు – మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ ఎలా స్పందించాడో తెలుసుకోవాలి అనేదారిపై ఉంటుంది. విశ్రాంతి ఘట్టానికి ముందు.. ఆ ఎపిసోడ్ ని మొదలెట్టి… ఫస్టాఫ్కి బ్రేక్ ఇచ్చాడు దర్శకుడు.
ద్వితీయార్థం అంతా.. ముంబై ఆపరేషనే. అందులో మేజర్ వ్యూహాలు, చావుకి ఎదురెళ్లి శత్రువులపై పోరాడిన వైనం.. ఇవన్నీ థ్రిల్లింగ్ గా ఉంటాయి. ఇప్పటికే ముంబై ఉగ్రదాడి నేపథ్యంలో కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లూ వచ్చాయి. అయినా సరే, ఆయా సన్నివేశాల్ని ఉద్వేగ భరితంగా చూపించగలిగాడు దర్శకుడు. హోటెల్ లో ఓ పాపని కాపాడడానికి ఓ యువతి (శోభిత ధూళిపాళ) చేసిన ప్రయత్నం.. ఇవన్నీ ప్రేక్షకుల్ని కుర్చీలకు అతుక్కునేలా చేస్తాయి. చివరి పావుగంటా.. పతాక స్థాయిలోకి తీసుకెళ్లారు. ఉగ్రవాదుల్ని మేజర్ సందీప్ ఒక్కడే ఎలా ఎదుర్కొన్నాడన్నది హీరోయిటిక్గా చూపించారు. ప్రాణాలు పోతున్నా – దేశ రక్షణే ధ్యేయంగా సాగించిన పోరాటం.. ఉద్వేగభరితం. చివర్లో ప్రకాష్ రాజ్ స్పీచ్ కంటతడిపెట్టిస్తుంది. ఆ ఎమోషన్ని దర్శకుడు చాలా చక్కగా క్యారీ చేయగలిగాడు. సీట్లలోంచి లేచిన ప్రతీ ఒక్కరూ బరువైన గుండెతో.. ఇంటికి వెళ్లేలా.. ఆయా సన్నివేశాల్ని మలిచాడు.
నిజానికి సింగిల్ థ్రెడ్ మీద సాగే కథ ఇది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం, తాను సాధించిన విజయాలు, తన దేశభక్తి.. వీటి చుట్టూనే కథ నడపాలి. 26/11 ఎటాక్ మొత్తం గురించి చెప్పాలంటే ఈ కథని ఎలాగైనా చెప్పొచ్చు. ఏ కోణంలోనైనా తిప్పవచ్చు. కానీ కేవలం మేజర్ కథ మాత్రమే చెప్పాలి కాబట్టి లిమిటేషన్స్ ఎక్కువయ్యాయి. ఆ అవాంతరం ఉన్నప్పటికీ అందులోనే ఈ కథని హృద్యంగా చెప్పలిగాడు దర్శకుడు. ఈ కథకు టెక్నికల్ టీమ్ సపోర్ట్ చాలా కీలకం. ఫొటోగ్రఫీలో గానీ, ఎడిటింగ్ లో గానీ, నేపథ్య సంగీతంలో గానీ, ఎక్కడా.. లోటు చేయలేదు. విజువల్స్ గ్రాండ్ గా ఉన్నాయి.యాక్షన్ కొరియోగ్రఫీ.. చాలా నీట్ గా సాగింది. రియలిస్టిక్ గా ఉంటూనే, కమర్షియల్ గానూకనిపించింది. అబ్బూరి రవి సంభాషణలు మరో అదనపు ఆకర్షణ. మరీ.డోసులు ఎక్కువైపోయి, స్పీచుల్లా మారకుండా.. నీట్ గా సంభాషణల్ని రాసుకొన్నారు. ముఖ్యంగా చివర్లో ప్రకాష్ రాజ్ చెప్పే డైలాగులు ఈ సినిమాకి మకుటంలా మారాయి.
అడవి శేష్ ఈ పాత్రకు ఎంత చేయాలో అంతే చేశాడు. నటుడిగా తానెప్పుడూ కొత్త తరహా పాత్రలవైపే మొగ్గు చూపిస్తాడనడానికి `మేజర్` మరో ఉదాహరణ. ఎమోషన్ సీన్ల విషయంలో ఇంకాస్త ఇంప్రూవ్ అయ్యాడు. మేజర్లా కనిపించడానికి శయశక్తులా కృషి చేసి విజయం సాధించాడు. ప్రకాష్‌రాజ్, రేవతి బరువైన పాత్రల్ని చాలా అవలీలగా మోసేశారు. వారి అనుభవం చాలా ఉపయోగపడింది. సయీ మంజ్రేకర్ పద్ధతిగా కనిపించింది. శోభితది చిన్న పాత్రే.కానీ సెపరేట్ ట్రాక్ గా కనిపించింది. మురళీ శర్మ హుందాగా నటించారు. ఎవరి పాత్రకు వాళ్ల వంతు న్యాయం చేశారు.
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ లాంటి వాళ్లు ఈ దేశానికి చాలా చేశారు. వాళ్లకు తిరిగి ఏం ఇవ్వగలం? ఇలాంటి బయోపిక్‌లు తీసి, నివాళి అర్పించడం తప్ప! ఒక ఉద్వేగ భరితమైన ప్రయత్నం ఇది. ప్రతీ ఒక్కరిలోనూ లోలోపల దాగి ఉన్న దేశభక్తి భావాన్ని.. ఇంకోసారి తట్టి లేపుతుంది. ఇండియన్ ఆర్మీ గొప్పతనాన్ని, ఖ్యాతిని, త్యాగనిరతిని వెండి తెరపై ఆవిష్కరించిన వైనం ప్రశంసిచతగినది.
TELUGU360 RATING : 3/5