కాంగ్రెస్ లో మంత్రి పదవుల పంచాయతీ సుదీర్ఘంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదిగో విస్తరణ.. అదిగో విస్తరణ అంటున్నారు కానీ.. ఒక్క అడుగు ముందుకు పడటం లేదు. దీనికి కారణం ఆశావహులు ఎక్కువగా ఉండటం.. ఎవరూ వెనక్కి తగ్గే అవకాశాలు లేకపోవడమే. ఇతర సామాజికవర్గాల్లో ఈ పోటీ అంతగా లేదు.. ధిక్కరించేవారూ కనిపించడం లేదు. కానీ రెడ్డి సామాజికవర్గంలో మాత్రం ఎవరూ తగ్గడం లేదు. పదవి ఇస్తారా లేదా అన్నట్లు గా మాట్లాడుతున్నారు.
ఎన్నికలకు ముందు తనకు మాటిచ్చారని.. తనకు పదవి ఇవ్వాల్సిందేనని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. ఆయన హోంశాఖను ఎంపిక చేసుకుని ఎలా.. ఓ ఆట ఆడుకోవాలన్నదానిపై అప్పుడే ప్రాక్టిస్ చేస్తున్నారు. తనకు పదవి ఇవ్వకపోతే పార్టీని రోడ్డున పడేస్తానన్నట్లుగా ఆయన ఉన్నారు. ఇప్పుడు మరో సీనియర్ నేత మల్ రెడ్డి రంగారెడ్డి కూడా తనదైన శైలిలో బెదిరిపులకు దిగుతున్నారు.
సామాజికవర్గం కారణంగా మంత్రి పదవి ఇవ్వలేకపోతే ఇబ్రహీంపట్నం నుంచి రాజీనామా చేస్తానని .. ఏ వర్గానికి పదవి ఇస్తారో చెబితే ఆ వర్గాన్ని నిలబెట్టి గెలిపిస్తానని చెబుతున్నారు. మల్ రెడ్డి చాలా సీనియర్ నేత. ఆయనకు దూకుడెక్కువ. ఎన్నికలు జరుగుతున్న సమయంలో మొదటి జాబితాలో టిక్కెట్ ప్రకటించకపోవడంతో ప్రచారం మధ్యలోనే ఆపేసిన రికార్డు ఆయనది. రెండో జాబితాలో పేరు ఉన్న తర్వాతనే మళ్లీ ప్రారంభించారు. ఇప్పుడు పదవి తనను కాదని మరో రెడ్డి నేతకు ఇస్తే ఆయన ఊరుకునే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి.