తెలుగులో మాళవికా నాయర్ నటించినవి ఐదంటే ఐదు సినిమాలు మాత్రమే! అందులోని మూడు సినిమాల్లో విజయ్ దేవరకొండ వున్నాడు. విచిత్రం ఏంటంటే… ఒక్క సినిమాలోనూ వీళ్ళిద్దరూ జంటగా నటించలేదు. ‘ఎవడే సుబ్రమణ్యం’లో నానికి జోడీగా మాళవిక నటిస్తే… నానికి స్నేహితుడిగా విజయ్ దేవరకొండ నటించాడు. అయితే… ఇద్దరి కాంబినేషన్లో సీన్లు వున్నాయనుకోండి! ఆ సినిమా తరవాత విజయ్ దేవరకొండ ‘అర్జున్‌రెడ్డి’, ‘గీత గోవిందం’, ఇప్పుడు ‘టాక్సీవాలా’తో స్టార్‌గా ఎదిగాడు. ఇందులోనూ విజయ్ దేవరకొండకు మాళవిక జోడీగా నటించలేదు. మధ్యలో ‘మహానటి’లో ఇద్దరూ కీలక పాత్రలు చేశారు. ఇద్దరిదీ మూడు సినిమాల స్నేహం అన్నమాట! ఇండస్ట్రీలో తనకు క్లోజ్ ఫ్రెండ్ కూడా విజయ్ దేవరకొండే అని మాళవికా నాయర్ తెలిపారు. ‘ఎవడే సుబ్రమణ్యం’ చిత్రానికీ, ‘టాక్సీవాలా’ చిత్రానికీ విజయ్ దేవరకొండ స్టార్డమ్లో మార్పు వచ్చింది గానీ… వ్యక్తిగా అతడు కొంచెం కూడా మారలేదని ఆమె వ్యాఖ్యానించారు. ‘టాక్సీవాలా’ విజయం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. అందరూ తన పాత్ర గురించి మాట్లాడుతుంటే సంతోషంగా వుందన్నారు. తనకు నచ్చిన పాత్రలు మాత్రమే చేస్తున్నానని, అవకాశాలు వస్తున్నా కథలో ప్రాధాన్యత లేని పాత్రలు కావడంతో చాలా సినిమాను తిరస్కరించానని ఆమె అన్నారు.