పొరుగింటి పుల్లకూర మనకు రుచి. బయటివాళ్లకు కాదు. పరభాషా నటుల్ని తీసుకొచ్చి, నెత్తిన పెట్టుకుని, వాళ్లకు పాలాభిషేకాలు చేయడం, అడిగినంత పారితోషికాలు ఇచ్చి గౌరవంగా చూసుకోవడం – టాలీవుడ్ కి మాత్రమే అబ్బిన విద్య. `పాన్ ఇండియా` మోజొకటి పెరిగింది కదా? దాంతో… ఎక్కడ, ఏ నటుడు దొరుకుతాడా? తీసుకొచ్చి క్యారెక్టర్ ఇచ్చేద్దామా? అనే ఆత్రుత, ఉత్సాహం చూపిస్తున్నారు దర్శక నిర్మాతలు. ఒక్కోసారి స్థాయి లేని వాళ్లని అందలం ఎక్కిస్తున్నారు. వాళ్ల మార్కెట్ ని దాటి మరీ పారితోషికాలు ఇస్తున్నారు. ఓరకంగా… నటీనటుల పారితోషికాలు అమాంతంగా పెంచేసేది మన నిర్మాతలే.
ఇటీవల ఓ మలయాళ నటుడు తెలుగు సినిమాలో కీలక పాత్ర పోషించాడు. తనకు రోజువారీ పారితోషికం ఇస్తామన్నది షరతు. అలా.. దాదాపు 20 రోజుల పాటు తనపై షూటింగ్ చేశారు. తీరా తీసింది రెండు సీన్లే. సినిమాకి ఇంత అని పారితోషికం ఫిక్స్ చేసుకుంటే.. సగానికిపైగా పారితోషికం మిగిలిపోయేది. కానీ నిర్మాతలు అలా చేయలేదు. సెట్లో ఇక్కడి వాతావరణాన్ని, డబ్బులు ఖర్చు పెట్టే తీరుని చూసి సదరు నటుడు ఆశ్చర్యపోయాడట. ఇక్కడ హాయిగా షూటింగ్ చేసుకుని, తన సీమకు వెళ్లి.. `తెలుగు వాళ్లకు సినిమా అంటేనే తెలీదు.. డబ్బులు టిష్యూ పేపర్లలా వాడుతున్నారు` అంటూ నెగిటీవ్ కామెంట్లు చేశాడట. అసలు విజన్, క్లారిటీ లేని దర్శకుడి దగ్గర పనిచేశా….అని తనకు తెలిసిన వాళ్ల దగ్గర, తెలియని వాళ్ల దగ్గర కూడా ప్రస్తావిస్తున్నాడట. నిజానికి ఈ సినిమా ద్వారా.. తన కెరీర్లోనే అత్యధిక పారితోషికం అందుకోగలిగాడు ఆ నటుడు. అంత తీసుకున్నా – ఎంత చులకన భావం? అదే డబ్బులో సగం తెలుగు నటుడికి ఇస్తే – అంతకంటే బాగా నటించేవాడు. కానీ ఏం చేస్తాం? కోరి తెచ్చుకున్న కష్టాలు కూడా భరించాల్సిందే. ఇప్పుడు ఆ నటుడి అవాకులూ చెవాకులూ వినాల్సిందే. అంతే.