సినిమా రంగంలోని నటీనటులు సైడ్ బిజినెస్‌లు చేయడంలో రాటుదేలిపోతారు. కొందరు.. తమ తెలివి తేటలతో.. జిమ్‌లు, షోరూలు, బ్రాండింగ్ వ్యాపారాలు చేసుకుంటారు. మరికొందరు… అక్రమ మార్గాలను ఎంచుకుంటారు. తరచూ ఫలానా నేరాల్లో ఫలానా నటి, నటుడు అని వార్తలు వస్తూనే ఉంటాయి. అయితే.. కేరళలో మాత్రం సూర్యశశికుమార్ అనే నటీమణి.. ఎవరూ ఊహించని సైడ్ బిజినెస్ ప్రారంభించారు. అదే దొంగ నోట్ల ముద్రణ. తన ఇంట్లో రెండో అంతస్తులో… అత్యాధునిక ప్రింటింగ్ మెషిన్లతో ఓ ప్రెస్‌నే ఏర్పాటు చేశారు. మూడో కంటికి తెలియకుండా ముద్రణ ప్రారంభించారు. ఈ దొంగ నోట్ల మార్కెటింగ్ అంతా..సూర్యశశికుమార్ తల్లీ, చెల్లి చూసుకుంటారు. తల్లీకూతుళ్లు ముగ్గురూ కలిసి..ఈ వ్యాపారం జోరుగానే కొనసాగిస్తున్నారు.
ఎంత కాలం నుంచి చేస్తున్నారో కానీ… రెండు రోజుల కిందటి వరకూ ఎవరికీ అనుమానం రాలేదు. గత వారం.. కేరళలోని ఇడుక్కి అనే ఊరిలో పోలీసులు రెండున్నర లక్షల రూపాయల నకిలీ నోట్లను పట్టుకున్నారు. ముగ్గుర్ని అరెస్ట్ చేశారు వారి వద్ద నుంచి తీగ లాగితే… డొంక కదిలిదింది. పోలీసులు పకడ్బందీగా… విచారణ జరపడంతో… సూర్యశశికుమార్, ఆమె తల్లి, చెల్లి వ్యవహారం బయటకు వచ్చింది. అనుమానం రాకుండా రెయిడ్ చేయడంతో.. ప్రింటింగ్ మెషిన్లతో సహా పట్టుబడ్డారు. అప్పటికే ముద్రించి ఉన్న రూ. 57 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
దొంగ నోట్లు ముద్రించేందుకు రూ.4.36 లక్షలు ఖర్చు చేసి మెషినరీ కొన్నారు. లాభాల్లో సగం ఇవ్వాలని ఆమె పలువురితో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎప్పట్నుంచి ఈ దొంగనోట్లు ప్రింట్ చేస్తున్నారు.. ఎంత మొత్తం చెలామణి చేశారన్న దానిపై పోలీసులు కూపీ లాగుతున్నారు. మొత్తానికి నటీమణి సైడ్ బిజినెస్ వ్యవహారం కేరళలోనే .. చుట్టుపక్కల రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ అయింది