సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మాల్కాజ్ గిరి లోక్ సభ సెగ్మెంట్ లో కాంగ్రెస్ వెనకబడి ఉందా..? కాంగ్రెస్ ఎన్నికల వ్యుహకర్త సునీల్ కనుగోలు ఏఐసీసీ దూతలకు సమర్పించిన రిపోర్ట్ లో ఏముంది..? ఆదివారం రాష్ట్ర నేతలతో ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో సమావేశం జరగడంతో ఈ అంశంపై వాడివేడిగా చర్చ జరుగుతోంది.
మల్కాజ్ గిరి.. రేవంత్ రెడ్డి ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కావడంతో స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఎలాగైనా అక్కడ నెగ్గాలని బలమైన ఆర్థిక, రాజకీయ నేపథ్యం ఉన్న పట్నం మహేందర్ రెడ్డి సతీమణి సునీతా మహేందర్ రెడ్డికి టికెట్ కేటాయించారు. బీజేపీ కూడా ఈటల రాజేందర్ ను బరిలో నిలిపి కాంగ్రెస్ కు ఓ రకమైన హెచ్చరికలు పంపింది. ఇప్పటికే మల్కాజ్ గిరి నియోజకవర్గంలో ప్రధాని మోడీ ఓ దఫా ప్రచారం నిర్వహించి వెళ్ళారు. కానీ, ఎన్నికల రేసులో కాంగ్రెస్ కాస్త వెనకబడి ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం హైదరాబాద్ నోవాటెల్ లో కాంగ్రెస్ నేతలు, అభ్యర్థులతో కేసీ వేణుగోపాల్ సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా సునీల్ కనుగోలు ఇచ్చిన నివేదిక ఆధారంగా అభ్యర్థులకు పలు సూచనలు చేసి…కొంతమందికి సుతిమెత్తగా హెచ్చరికలు కూడా చేసినట్లుగా తెలుస్తోంది. ప్రచారంలో దూకుడు పెంచాలని.. స్థానిక నేతలను కలుపుకొని, కీలక నేతలను పార్టీలో చేర్చుకుంటూ గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని సూచించారు. గెలుపు ధీమాతో నిర్లక్ష్యం వహించవద్దని.. రాహుల్ గాంధీని ప్రధాని చేసేందుకు తెలంగాణ ఫలితాలు ప్రత్యేకంగా దోహదం చేయాలన్నారు. ఈ నేపథ్యంలో చేవెళ్ల, మల్కాజ్ గిరి, సికింద్రాబాద్ సెగ్మెంట్ లపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని చెప్పినట్లుగా తెలుస్తోంది.
పట్నం సునీతా మహేందర్ రెడ్డికి స్థానిక నేతల నుంచి సహాయ నిరాకరణ కొనసాగుతోంది. స్థానికులను కాదని స్థానికేతరులకు టికెట్ ఇవ్వడం పట్ల సీనియర్ నేతలు నారాజ్ గా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఎన్నికల ప్రచారంలో స్థానిక నేతలను సమన్వయం చేసుకోవాలని పట్నం దంపతులకు సూచించినట్లు తెలుస్తోంది. అయితే.. మాల్కాజ్ గిరిలోని నేతల మధ్య నెలకొన్న విభేధాలకు ఫుల్ స్టాప్ పడాలంటే రేవంత్ బరిలోకి దిగితేనే సెట్ అవుతుందని… ఆయన ఎంటర్ అవుతే కాంగ్రెస్ ఫుల్ స్వింగ్ లోకి వస్తుందన్న క్యాడర్ అభిప్రాయపడుతోంది.