తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద ఎత్తన నేతలు వలస వస్తున్నారు. టాలీవుడ్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. తనకు బీఆర్ఎస్ అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు తన సొంతగూటికి చేరానని .. గతంలో యూత్ కాంగ్రెస్ లో పనిచేశానని చంద్రశేఖర్ రెడ్డి చెబుతున్నారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున హైదరాబాద్ శివార్లలో ఇబ్రహీంపట్నం లేదా మరో నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. కానీ చాన్స్ లభించలేదు. ఇటీవల ఎన్నికల్లో నాగార్జున సాగర్ టిక్కెట్ ఆశించారు.
తనకు టిక్కెట్ ఇస్తే.. తన అల్లుడు అల్లు అర్జున్ కూడా ప్రచారం చేస్తారని మీడియా ఇంటర్యూల్లో చెప్పారు. అయితే ఆయనకు అవకాశం దక్కలేదు. ఇప్పుడు కాంగ్రెస్ లో చేరారు. ఆయన మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తితోనే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లుగా తెలుస్తోంది. పార్టీ ఎలాంటి బాధ్యతలు ఇచ్చినా.. ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా పాటిస్తానని చంద్రశేఖర్ రెడ్డి అంటున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ లో పలువురు సీనియర్ నేతలు చేరారు.
పట్నం మహేందర్ రెడ్డి దంపతులతో పాటు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ , చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి కూడా కాంగ్రెస్ లో చేరారు. జవహర్ నగర్ మేయర్ కూడా కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ లో చేరిన వారంతా తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.