ఐటీ అధికారులతో మల్లారెడ్డి చేసిన ఓవరాక్షన్ ఆయనను మరిన్ని సమస్యల్లో ముంచే చాన్స్ కనిపిస్తోంది. ఐటీ అధికారులు తాము కనిపెట్టిన అంశాలతో ఈడీకి సమగ్రమైన లేఖ రాశారు. మీరు కూడా ేసులు పెట్టి దర్యాప్తు చేయాలని వారికి సమాచారం పంపారు. దీంతో ఈడీ కూడా రంగంలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ఐటీ అధికారులు పన్నులు ఎంత మేర కట్టలేదో కనుక్కుని ఫైన్ విధించే వరకే ఆలోచిస్తారు. కానీ ఈడీ అధికారులు అలా గాదు.. అక్రమ నగదు తరలింపు జరిగిందని తేలితే.. వెంటనే కేసు పెట్టి.. అరెస్ట్ చేస్తారు.
ఐటీ అధికారులతో మల్లారెడ్డి చాలా దారుణంగా వ్యవహరించారు. వారి ల్యాప్ ట్యాప్‌ను లాక్కోవడంతో పాటు .. వారిపై కేసులు కూడా పెట్టారు. బలవంతంగా సంతాలు పెట్టించుకున్నారని.. తన కుమారుడ్ని కొట్టారని ఆరోపించారు. వంద కోట్ల బ్లాక్ మనీ దొరికిందని సంతకాలు పెట్టించుకున్నారని.. అంత ఎక్కడిదని మల్లారెడ్డి ప్రశ్నిస్తున్నారు. నిజానికి ఎంత దొరికితే అంతే సంతకాలు పెట్టించుకుంటారు.. ఎక్కువ పెట్టించుకుంటే.. ఆ మొత్తం లెక్క చూపించాల్సింది ఐటీ అధికారులే. అయినా మల్లారెడ్డి అదేమీ పట్టించుకోకుండా తీవ్రమైన ఆరోపణలు చేశారు.
మల్లారెడ్డిపై ఈడీ కూడా కేసులు నమోదు చేస్తే.. ఆయనకు.. ఆయన వ్యాపార సంస్థలకు కూడా పెద్ద దెబ్బే. తమ ధైర్యం కేసీఆర్ అని.. మల్లారెడ్డి చెబుతున్నారు కానీ.. రేపు ఆయనను ఏ విధంగానూ కేసీఆర్ కాపాడలేరన్న అంచనాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కేసీఆర్ మాటలు విని.. మల్లారెడ్డి ఆశ్చర్యపోయి.. ఐటీ అధికారులపై ఎదురుదాడి చేశారని..ఇప్పుడు వారు తీసుకోబోయే చర్యలను తప్పించుకోవడం కష్టమన్న భావన వ్యక్తమవుతోంది.