తనకు ఐదు వందల ఎకరాలు ఉన్నాయని తనకు ఎవరి భూమి కబ్జా చేయాల్సిన పనే లేదని మల్లారెడ్డి తరచూ చెబుతూంటారు. కానీ ఓ స్థలం విషయంలో మాత్రం ఆయన నేరుగా రంగంలోకి దిగి చేస్తున్న రచ్చ మాత్రం చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. సుచిత్ర వద్ద ఉన్న స్థలం విషయంలో ఏర్పడిన వివాదంలో వరుసగా రెండో రోజు కూడా ఉదయమే అల్లుడు రాజశేఖర్ రెడ్డితో కలిసి వచ్చి హంగామా చేశారు.
సుచిత్ర వద్ద ఉన్న స్థలాన్ని తమదిగా మల్లారెడ్డి చెబుతున్నారు. దానికి ఆయన వద్ద డాక్యుమెంట్లు ఉన్నాయి. కానీ అందులో సగం తాము కొనుక్కున్నామని.. మల్లారెడ్డినే తప్పుడు డాక్యుమెంట్లు చూపిస్తున్నారని ఇతరులు ఆరోపిస్తున్నారు. వారు కోర్టులో విజయం సాధించారు కూడా. అయినా మల్లారెడ్డి పట్టు వీడటం లేదు. అది తనదేనని అంటున్నారు. ఆయనకు తోడుగా రాజశేఖర్ రెడ్డి వచ్చారు.
ఇది సివిల్ డిస్ప్యూట్ కావడంతో చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని పోలీసులు చెబుతున్నారు. స్థలం దగ్గర హడావుడి చేస్తే మాత్రం అదుపులోకి తీసుకుంటమని చెబుతున్నారు. శనివారం.. ఆ ల్యాండ్ పై సర్వే చేయించారు. ఏం తేలిందో కానీ మల్లారెడ్డి , ఆయన అల్లుడు మాత్రం ఉదయమే స్థలం వద్దకు వచ్చేశారు. అధికారంలో ఉన్నంత కాలం… మల్లారెడ్డి చేసిన వ్యవహారాలను పోల్చి…. ఈ స్థల వివాదం సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు కొందరు.