మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కాంగ్రెస్ లో చేరనున్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో మల్లారెడ్డి రాజకీయ భవిష్యత్ ప్రమాదంలో పడింది. ఆయనకు మెడికల్ కాలేజీలు, ఇంజినీరింగ్ కాలేజీలతోపాటు ఇతర వ్యాపారాలు, ఆస్తులు ఉన్నాయి. వీటికి సంబంధించి ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. కేసులు కూడా నమోదవుతున్నాయి. మూడు రోజుల కిందట తమ కాలేజీ కోసం ప్రభుత్వ భూమి ఆక్రమించి నిర్మించిన రోడ్డును అధికారులు తొలగించారు.
మొదటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ఉన్న రాజకీయ వైరం, గతంలో రేవంత్ రెడ్డిపై ఘాటైన పదజాలంతో వ్యాఖ్యలు చేయడంతో మల్లారెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకునేందుకు ఎవరూ ఆసక్తి చూపించలేదు. అయితే మల్లారెడ్డి కర్నాటక రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ కీలక నేతతో రాయబారం నడిపానని కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు అంగీకరించారని ఆయన చెబుతుననారు. గతంలో ఎంపీగా, మంత్రిగా మల్లారెడ్డి మేడ్చల్ జిల్లాను తన గుప్పిట్లో పెట్టుకొని భూములను కారు చౌకగా తన పేరిట, అనుచరుల పేరిట కొనుగోలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు వార్తలు వస్తుండటంతో ఆ పార్టీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మల్లారెడ్డి వైఖరి నచ్చకనే గత ఎన్నికల సమయంలో మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. మొన్నటి ఎన్నికలలో పోటీ చేసిన కాంగ్రెస్ మేడ్చల్ నియోజకవర్గం ఇన్చార్జి తోటకూర వజ్రేష్ యాదవ్, సీనియర్ నాయకుడు నక్క ప్రభాకర్‌గౌడ్ మల్లారెడ్డి రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రెండు రోజుల్లో రేవంత్ రెడ్డి చాయిస్ మీదనే మల్లారెడ్డిని కాంగ్రెస్ లో చేర్చుకునే అవకాశాలు ఉన్నాయి.