తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు కంట్రోల్ తప్పి పోతున్నారు. నిన్నటిదాకా బీజేపీ నేతలపై ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు విరుచుకుపడ్డారు. నీకేనా నోరుంది మాకు లేదా అని బీజేపీ నేతలు కార్యకర్తలు మైనంపల్లిపై బూతులతో విరుచుకుపడ్డారు. ఆ ఎపిసోడ్ చల్లబడుతూందనగా సీన్లోకి మల్లారెడ్డి ఎంటరయ్యారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మేడ్చల్ నియోజకవర్గంలోని మూడు చింతలపల్లిలో దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్ష చేశారు. ముగింపు సభలో మల్లారెడ్డి పై విమర్శలు చేశారు. మల్లారెడ్డి మేడ్చల్ ఎమ్మెల్యే మాత్రమే కాదు మంత్రి కాదు. రేవంత్ రెడ్డి అలా విమర్శలు చేయగానే ప్రెస్‌మీట్ పెట్టిన మల్లారెడ్డి చెలరేగిపోయారు. లేచి తొడకొట్టారు.
రేవంత్ రెడ్డి గాడు.. వీడు.. గాండు అంటూ తనకు తెలిసిన తిట్లన్నీ తిట్టి పడేశారు. రాజీనామా చేద్దాం రమ్మని సవాల్ చేశారు. మల్లారెడ్డి తిట్లు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి. అంతే.. కాంగ్రెస్ నేతలు ఒక్క సారిగా విరుచుకుపడ్డారు. చోటా మోటా నేతలంతా అమ్మనాబూతులు తిడుతూ పోస్టులు పెట్టడం ప్రారంభించారు. అయితే రేవంత్ రెడ్డిపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని మల్లారెడ్డి మళ్లీ ప్రకటించారు. రేవంత్ రెడ్డి తిడితే తాను ఎందుకు పడతానని ఆయన అంటున్నారు.
అధికారపక్షంలో ఉండి మరీ ఇలా మంత్రులు.. ఎమ్మెల్యేలు తిట్లు లంకించుకోవడం వివాదాస్పదమవుతోంది. అయితే టీఆర్ఎస్ అగ్రనేతలు మాత్రం ఇలా మాట్లాడేవారిని వారించడం లేదు. అలాగే సమాధానం ఇవ్వాలన్నట్లుగా వారు సైలెంట్‌గా ఉండటంతో తమ భాషా ప్రావీణ్యాన్ని ప్రదర్శించే వారి సంఖ్య పెరిగిపోయింది. ముందు ముందు మరింత మంది అదే బాటలో పయనించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.