మున్సిపల్ ఎన్నికల్ని మంత్రుల మెడకు తగిలించేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. పార్టీ ఓడిపోతే పదవులు ఊడిపోతాయని కూడా హెచ్చరించారు. దీంతో సహజంగానే మంత్రులందరూ వారి సొంత నియోజక వర్గాల్లో హడావుడి చేస్తున్నారు. వీళ్లలో కొంతమందైతే మరీ వణికిపోతున్నారట. పార్టీని గెలిపించి తీరాలనే పట్టుదలతో కాకుండా, పదవి ఊడతదేమో అనే భయంతో ఎన్నికల్ని ఫేస్ చేస్తున్నారట. ఆ జాబితాలో మంత్రి మల్లారెడ్డి ఉన్నారని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఈ ఎన్నికల తరువాత ముందుగా మల్లారెడ్డికి స్థాన చలనం ఉంటుందని భావిస్తున్నారట. ఆయనే ఎందుకు… మిగతావారు ఎందుకు కాదు అంటే, దానికో నేపథ్యం ఉంది.
మల్లారెడ్డి అనూహ్యంగా కేసీఆర్ కేబినెట్లోకి వచ్చారు. లోక్ సభ ఎన్నికల్లో సరైన పనితీరు కనబర్చని మంత్రులకు ఉద్వాసన పలికేద్దామని.. పార్లమెంటు ఎన్నికల ఫలితాల సమయంలోనే సీఎం కేసీఆర్ భావించారట. ఆయన్నే టార్గెట్ చేసుకోవడం వెనక అప్పట్లో రెండు కారణాలు కనిపించాయి. ఒకటీ… కార్మిక ఉపాధి కల్పన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఆయన పనితీరు అస్సలు బాగులేదని ముఖ్యమంత్రి భావించారు. రెండోది… కేసీఆర్ కి రాజకీయ శత్రువైన కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డిని లోక్ సభ ఎన్నికల్లో ఓడించే బాధ్యతని మల్లారెడ్డికి కేసీఆర్ అప్పగించారు. మల్లారెడ్డి అల్లుడికే తెరాస టిక్కెట్ ఇచ్చి, ఆ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా కేసీఆర్ తీసుకుంటే… చివరికి మల్కాజ్ గిరి ఎంపీగా రేవంత్ రెడ్డి గెలిచారు.
ఈ రెండు కారణాలతో మంత్రి మల్లారెడ్డి మీద కేసీఆర్ అప్పట్నుంచీ గుర్రుగా ఉన్నారట. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఏదైనా గడబిడ అయిందే అనుకోండి… ముచ్చటగా మూడో కారణం మల్లారెడ్డి ఖాతాలో పడుతుంది. ఆయన్ని కేబినెట్ నుంచి తప్పించడానికి ఈ మూడూ చాలు కదా. ఈ అంచనా ఉంది కాబట్టే మల్లారెడ్డి అతి జాగ్రత్తగా ఉంటున్నారట. కుటుంబ సభ్యులందరికీ మున్సిపోల్స్ బాధ్యతలు పంచారని తెలుస్తోంది. అందుకే, ఒక అసంత్రుప్త నేత కాంగ్రెస్ లోకి వెళ్తున్నారని తెలియగానే హుటాహుటిన ఆ నాయకుడి ఇంటికి వెళ్లిపోయారు.