కల్తీ మద్యం కేసులో తొమ్మిదవ నిందితుడిగా ఉన్న విజయవాడ కాంగ్రెస్ నగర అధ్యక్షుడు మల్లాది విష్ణు బుదవారం కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ‘సిట్’ అధికారుల ముందు ఈరోజు విచారణకు హాజరయ్యారు. ఆయన కుటుంబీకులకు చెందిన స్వర్ణబార్ అండ్ రెస్టారెంటులో కల్తీమద్యం తాగి నెల రోజుల క్రితం ఐదుగురు వక్తులు చనిపోయారు. దానిపై కేసు నమోదు చేసిన పోలీసులు దానిలో మల్లాది విష్ణు పేరు కూడా చేర్చడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఆయన పెట్టుకొన్న ముందస్తు బెయిల్ పిటిషన్ని విజయవాడ కోర్టు తిరస్కరించి తక్షణమే పోలీసుల ముందు లొంగిపొమ్మని ఆదేశించడంతో ఆయన మళ్ళీ విజయవాడ తిరిగివచ్చేరు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ తానేమీ ఎక్కడికీ పారిపోలేదని తీర్ధయాత్రలకి వెళ్ళానని చెప్పుకొన్నారు. అయితే అది అబద్దమని అందరికీ తెలుసు. తనపై కేసు నమోదు అయ్యిందని తెలిసిన తరువాతే అయన హటాత్తుగా మాయం అయిపోయారు. పోలీసులు తన కోసం వెతుకుతున్నారనే సంగతి తెలిసినప్పటికీ ఆయన తిరిగిరాలేదు. కోర్టు ఆదేశించడం చేత తప్పనిసరి పరిస్థితుల్లో అజ్ఞాతం వీడి పోలీసుల ముందు లొంగిపోవలసివచ్చిందని స్పష్టం అవుతోంది. నెల రోజుల తరువాత తిరిగి వచ్చి “ప్రజాప్రతినిధిగా పనిచేసిన తనకు చట్టం, న్యాయ వ్యవస్థల పట్ల అపారమయిన గౌరవం ఉందని, విచారణకు సహకరిస్తానని” చెప్పుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇదే పని ఆయన మొదటే చేసి ఉంటే చాలా గౌరవప్రదంగా ఉండేది.