హైదరాబాద్: విజయవాడలో ఇటీవలి కల్తీమద్యం దుర్ఘటనలో ఐదుగురి మృతికి కారణమైన స్వర్ణ బార్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుదేనని నిర్ధారణ అయింది. కల్తీ మద్యం దుర్ఘటనపై ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో ఒక ప్రకటన చేసింది. ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఇవాళ సభలో దీనిపై ప్రకటన చేస్తూ, విజయవాడ కృష్ణలంక ప్రాంతంలో ఉన్న స్వర్ణ బార్ మల్లాది విష్ణుదేనని చెప్పారు. ఈ దుర్ఘటనలో చనిపోయినవారి కుటుంబాలకు రు.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించినట్లు తెలిపారు. ఘటనకు బాధ్యులైనవారిని కఠినంగా శిక్షిస్తామని కూడా చెప్పారు. మరోవైపు కల్తీమద్యం కేసులో మల్లాది విష్ణు ముందస్తు బెయిల్ కోసం చేసుకున్న పిటిషన్పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. విష్ణుకోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. ఆయన హైదరాబాద్, షిర్డికి మధ్యలో తిరుగుతున్నట్లు చెబుతున్నారు. ఆయన షిర్డిలో ఉన్నట్లు కనిపిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో రౌండ్స్ కొడుతున్నాయి.