వైసీపీకి అండగా నిలుస్తూ వస్తున్న బ్రాహ్మణ వర్గానికి జగన్ ఝులక్ ఇస్తున్నారు. మంత్రి పదవి ఇవ్వకపోగా.. ఉన్న డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి కోన రఘుపతిని తొలగిస్తున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా.. నిధులు..విధులు ఉండని ప్లానింగ్ కమిషన్ చైర్మన్ పదవిని మల్లాది విష్ణుకు ప్రకటించారు. మంత్రి పదవి ఆశించిన విష్ణుకు.. మొండి చేయిచూపారు. ఆయనకు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్‌గా నియమించనున్నట్లుగా మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడే సీఎం క్యాంప్ ఆఫీస్ వర్గాలు ప్రకటించాయి.
అయితే ఉత్తర్వులు మాత్రం తాజాగా విడుదలయ్యాయి. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా కోన రఘుపతి ఉన్నారు. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా కోలగట్ల వీరభద్రస్వామిని నియమించనున్నారు.ఈ కారణంగా వారి సామాజికవర్గానికి కేబినెట్ హోదాతో ఓ పదవి ఉండాలన్న ఉద్దేశంతో మల్లాది విష్ణుకు కేబినెట్ హోదా ప్రకటించినట్లుగా భావిస్తున్నారు. మల్లాది విష్ణు ఇటీవలి వరకూ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉండేవారు. అయితే బ్రాహ్మణ కార్పొరేషన్‌కు పైసా కూడా కేటాయించడం లేదు.
అన్ని పథకాల్లో భాగంగా అందరికీ ఇస్తున్న వాటినే.. కార్పొరేషన్ కింద చూపిస్తున్నారు.దీంతో ఆయనకు ప్రాధాన్యం దక్కలేదని ఫీలయ్యారు. చివరికి ఇప్పుడు కేబినెట్ హోదా ఇచ్చినా పెద్దగా ప్రయోజనం ఉండదు. కానీ ఆ వర్గాన్ని ఏదో విధంగా సంతృప్తి పరచాలని..లేకపోతే ఓట్లు వేయరన్న ఉద్దేశంతో పదవి ఇచ్చినట్లుగా తెలుస్తోంది.