తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్‌ను జైలుకు తరలించి నెల దాటిపోయింది. ఓ కేసులో రిమాండ్ అయిపోతే.. మరో కేసులో అరెస్ట్ చేస్తున్నారు. ఆయన మళ్లీ ఎప్పుడు బయటకు వస్తారో తెలియని పరిస్థితి. ఇలాంటి సమయంలో ఆయనకు ఎవరూ అండగా నిలవకుండా పోయారు. బీజేపీ కి ఆయన కాస్తంత మద్దతు దారుడిగా వ్యవహరించినప్పటికీ ఆ పార్టీ నేతలు ఆయనకు సాయం చేయడానికి ముందుకు రాలేదు. బహుశా… తీన్మార్ మల్లన్న సొంతంగా రాజకీయంగా ఎదగడానికి ప్రయత్నాలు చేయడం వారికి నచ్చలేదేమో.
ప్రస్తుత పరిస్థితుల్లో తాను బయటకు రావాలన్నా బీజేపీ మద్దతు ఉండాల్సిందేనని అనుకున్నారేమో కానీ మల్లన్న ఒక్క సారిగా జై బీజేపీ అన్నారు. తన భర్త బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయనను అక్రమ అరెస్టుల నుంచి కాపాడాలని నేరుగా హోంమంత్రికి..బీజేపీ అధ్యక్షుడు నడ్డాకు మల్లన్న భార్య లేఖ రాశారు. అందులో తాము ఎదుర్కొన్న కష్టాలను ఏకరవు పెట్టారు. మల్లన్న బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారంటూ బీజేపీ నేతలు గొప్పగా చెప్పుకోడం ప్రారంభించారు. దీంతో ఇదంతా వ్యూహాత్మకంగానే జరుగుతోందన్న అభిప్రాయానికి మల్లన్న అభిమానులు వస్తున్నారు.
నిజానికి మల్లన్న లాంటి వ్యక్తిని అరెస్ట్ చేసినా ఏ రాజకీయ పార్టీ కూడా గట్టిగా ఆయనకు మద్దతుగా నిలబడలేదు. ప్రముఖ జర్నలిస్ట్‌గా ఉన్నా.. క్యూ న్యూస్ పేరుతో ఆయన నడిపే యూట్యూబ్ చానల్‌కు లక్షల మంది వ్యూయర్స్ ఉన్నా.. ఒంటరి అయిపోయారు. దీంతో ఆయన కూడా కనీసం తను బయటకు రావాలన్నా బీజేపీ మద్దతు ఉండాలని భావిస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. మొత్తానికి ఇప్పుడైనా మల్లన్నకు విముక్తి లభిస్తుందని ఆయన అనుచరులు ఆశలు పెట్టుకున్నారు.