Malli Pelli Movie Telugu Review
తెలుగు360 రేటింగ్: 2.25/5
నరేష్, పవిత్ర లోకేష్ ల ‘మళ్ళీ పెళ్లి’ సినిమా ప్రకటనతోనే చాలా ప్రశ్నలు తలెత్తాయి. ఇది వారి బయోపిక్కా ? కల్పిత కథా ? వారి మధ్య వున్న అసలైన బంధం గురించి ఇందులో చూపిస్తారా ? ఈ కథలో ఎవరిని విలన్ చేస్తారు ? ఇలా అనేక ప్రశ్నలు. దీనికి తోడు మళ్ళీ పెళ్లి ఆటంబాంబ్ లా పేలుతుందని పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చారు నరేష్. అలాగే యంఎస్ రాజు ఈ చిత్రానికి దర్శకుడు కావడం మరో విశేషం. అటు మీడియా, సోషల్ మీడియాలో నరేష్ పవిత్ర వివాదస్పద వార్తలు, ట్రోల్స్ లో నిలవడం ద్వారా సహజంగానే ఈ సినిమా ద్రుష్టిని ఆకర్షించింది. ఇలాంటి నేపధ్యంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మళ్ళీ పెళ్లి ప్రయాణం ఎలా సాగింది ? ప్రశ్నలు సమాధానం ఇచ్చిందా? కొత్త వివాదాలు సృష్టించిందా?
నరేంద్ర (నరేష్) రెండువందలకు పైగా సినిమాలు చేసి ఇప్పటికీ బిజీగా వుండే నటుడు. బోలెడు డబ్బు, పరపతి ఉన్నప్పటికీ వ్యక్తిగత జీవితం సరిగ్గా వుండదు. నరేంద్ర భార్య సౌమ్య సేనాపతి( వనితా విజయ్ కుమార్ )కి వేరే వ్యాపకాలు వుంటాయి. ఆమె ఇంటిపట్టున వుండదు. ఎప్పుడూ డబ్బు కావాలని పీడిస్తుంటుంది. సౌమ్యతో విసిగిపోయిన నరేంద్రకు ఓ సినిమా షూటింగ్ లో పార్వతి (పవిత్ర లోకేష్) ఎదురుపడుతుంది. ఆమెని చూడగానే ఎదో తెలియన ఆనందం పొందుతాడు నరేంద్ర. ఆమెతో స్నేహం చేస్తాడు. ఇంకా ముందుకు వెళ్లాని అనుకుంటాడు కానీ పార్వతి కుటుంబ జీవితం సంతోషంగా వుందని తెలుసుకొని ఆమెకు దూరంగానే ఉంటాడు. ఓరోజు.. పార్వతి నుంచి నరేంద్రకు ఓ మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ చదివిన నరేంద్ర షాక్ అవుతాడు. ఇంతకి ఆ మెసేజ్ లో ఏముంది? పార్వతి, నరేంద్రల ప్రయాణం ఎలా సాగింది? వీరిద్దరూ ఎలాంటి పరిస్థితులని ఎదురుకున్నారు ? అనేది మిగతా కథ.
ఇది బయోపిక్ కాదని అన్నారు నరేష్ , పవిత్ర. దర్శకుడు ఎంఎస్ రాజు కూడా ఇది బయోపిక్ కాదు..ప్రత్యేకంగా రాసుకున్న కథ అన్నారు. సస్పెన్స్ కోసం అలా చెప్పారోమో కానీ ఇది పక్కాగా నరేష్, పవిత్రల పరిచయం, స్నేహం, ప్రేమ, లివింగ్ రిలేషన్ కి సంబధించిన బయోపిక్. సినిమా ఆరంభం నుంచి చివరి వరకూ.. ప్రెస్ మీట్ లో వీరు మాట్లాడిన మాటలు, తన భార్య గురించి నరేష్ చెప్పుకున సంగతులు, హోటల్ ఎపిసోడ్, ఇలా దాదాపు వార్తల్లో నిలిచిన సంఘటనలనే సన్నివేశాలుగా మార్చారు.
అయితే నిజ జీవితంలోని సంఘటనలని సినిమాగా మార్చడంలో తప్పులేదు. కానీ పాత్రల మధ్య భావోద్వేగాలు వుండాలి. పాత్రలో ప్రయాణం వుండాలి. కానీ ఇందులోఅలాంటి ఏవీ కనిపించవు. నరేష్, పవిత్ర .. తమ పాత్రలని జీవితాలని పేరడీ చేసుకున్నట్లు వుంటుంది తప్పితే అందులో ఎలాంటి ఎమోషన్ కనిపించదు.
అందరికీ తెలిసిన కథే చెప్పడానికి దర్శకుడు చాపర్ట్ లు గా విడగొట్టాడు. నరేశ్, పవిత్ర పరిచయం ఒక చాప్టర్. దీనికి ఫ్లిర్టింగ్ అనే పేరు పెట్టారు. ఇందులో ఏం చెప్పారో పేరులోనే వుంది. తర్వాత మిస్టేక్ అని ఒక చాప్టర్ వుంది. ఇందులో చాలా ఏక పక్షంగా వెళ్లారు. నరేంద్ర భార్య సౌమ్యని మొదటి నుంచే ఒక వ్యాంప్ పాత్రగా చిత్రీకరించి, కథలో విలన్ సౌమ్యనే అన్నట్లు చూపించారు.
మళ్ళీ పెళ్లిలో కొత్త విషయం ఏదైనా ఉందా అంటే పార్వతి గతం. ఇది ఇప్పటివరకూ తెలియని కోణం. పార్వతి కులం తక్కువ అమ్మాయని చెప్పి ఆమెను దూరంపెడతాడు అతడి ప్రియుడు. పార్వతి పిచ్చితనమో అమాయకత్వం ఏమిటో గానీ అలాంటి వాడినే కోరుకుంటుంది. ఇద్దరు పిల్లలు కూడా కలుగుతారు. నరేంద్ర పరిచయంతో పార్వతికి కూడా ఒక స్వాంతన చేకూరినట్లు చూపించి దాన్ని ముగించారు. చివరి ఎపిసోడ్ వార్తల్లో ఉన్నదే. హోటల్ రోమ్ అండ్ మీడియా.
ఈ మొత్తం వ్యవహారం తెరపై చూసిన తర్వాత.. ఏదైనా ఒక విషయం, గొడవ జరిగితే.. ప్రముఖులు మీడియా ముఖంగా వివరణ ఇస్తారు. కానీ అలాంటి వివరణ ఇవ్వడానికి స్వయంగా నిర్మాత అవతారం ఎత్తి ఏకంగా ఒక సినిమా తీశారు నరేష్. పోనీ ఇందులో చూపించినవే నిజాలు అనుకోవడానికి లేదు. నరేష్ , పవిత్ర వెర్షన్ లో మళ్ళీ పెళ్లి చేసుకుంటూపోయారు.
నరేష్ , పవిత్ర మంచి నటులు. అయితే పాత్రలని తీర్చిద్దిన విధానంలో లోపం ఏమిటో కానీ వారి నటన అంతగా అతకదు. పైగా వాళ్ళ జీవితాన్ని వాళ్ళే పేరడీ చేసుకునట్లు ప్రజంట్ చేయడం ఒక లోపం. వయసుకు తగ్గ పాత్రలని కూడా అనిపించదు. పార్వతి చూసిన నరేష్ .. ఆమె వయసులో వున్న వీడియోలని అదోరకంగా చూసి అబ్బా.. ఎంత బావుందంటాడు. ఈ పాత్రని అలా చిత్రీకరించడంలో యంఎస్ రాజు ఎత్తుగడ ఏమిటో గానీ నరేష్ లాంటి నటుడు.. ఒక సినియర్ నటిని చూసి అలా ఫీలౌతాడా ? అని విస్తుపోవడం ప్రేక్షకుడి వంతౌతుంది. అలాగే వారి ప్రేమని కూడా హుందాగా డిజైన్ చేయలేదు. నరేష్ పడుచుపిల్లాడిలా ప్రవర్తించడం అస్సల్ కుదరలేదు. పవిత్ర కొంతలో కొంత బెటర్. వనితా విజయ్ కుమార్ ని విలన్ గా చూపించారు. అయితే నరేష్ ఆమెపై ముందుపోసి లైటర్ వెలిగించే సన్నివేశం, ఆమెను కాళ్ళతో తన్నే సన్నివేశం ఇబ్బందిగా వుంటుంది. ఎంత పర్శనల్ రివెంజ్ లేకపోతే తెరపై ఇలాంటి సీన్లు రావు. టీనేజ్ లో పవిత్రగా చేసిన అనన్య గ్లామరస్ గా కనిపించింది. నరేష్ తల్లితండ్రులుగా చేసిన జయసుధ, శరత్ బాబు హుందాగా కనిపించారు. ఈ రెండు కృష్ణ, విజయ నిర్మల పాత్రలే. జయసుధ ఒక సినిమాని డైరెక్ట్ చేస్తున్నట్లుగా కూడా చూపించారు. మిగతా పాత్రలు పరిధిమేరకు వున్నాయి
రచయిత, దర్శకుడిగా ఎం.ఎస్.రాజు చెప్పుకోదగ్గ వర్క్ చేయలేదనే చెప్పాలి. నరేష్ , పవిత్రల నిజ జీవితంలో ఎదురైన సంఘటనల్ని తెరకెక్కించారు.కథనంలో కూడా పెద్ద మెరుపులు వుండవు. నేపథ్య సంగీతం, కెమెరా పనితనానికి జస్ట్ ఓకే అని అనిపిస్తాయి.
నరేష్, పవిత్ర తమ అనుబంధం గురించి ఒక క్లారిటీ కోసం తీసుకున్న సినిమా ఇది. అయితే ఈ క్లారిటీ మాట పక్కన పెడితే.. చాలా కొత్త ప్రశ్నలు ఈ సినిమాతో తెరపైకి వచ్చాయి. భార్యకి విడాకులు ఇచ్చేశానని చెబుతుంటారు నరేష్. అలాంటి ప్రస్థావనే ఇందులో లేదు. అంటే సౌమ్య సేనాపతి (స్క్రీన్ నేమ్) చట్ట పరంగా ఇంకా నరేంద్ర జీవితంలో వుంది. ఈ సినిమా చూసిన తర్వాత తప్పకుండా ఆమె తన స్వరం వినిపిస్తుంది. ఈ వివాదం ఇంకా పెంచేలానే వుంది మళ్ళీ పెళ్లి.
తెలుగు360 రేటింగ్: 2.25/5