జమ్మూ కశ్మీర్ ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుకున్న వేళ అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. కథువా జిల్లాలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రసంగిస్తుండగా అస్వస్థతకు గురయ్యారు.
ఖర్గే ప్రసంగిస్తుండగా ఆయన అదుపు తప్పి కిందపడబోయారు. భద్రతా సిబ్బందితో పాటు వేదికపై ఉన్న నేతలు అప్రమత్తమై ఖర్గేను పట్టుకున్నారు. కాసేపటి తర్వాత మళ్లీ ప్రసంగాన్ని కొనసాగిస్తానని ఖర్గే భీష్మించుకు కూర్చున్నారు. పార్టీ నేతలు ఆయనను పట్టుకొని నిలబడగా… అలాగే తన ప్రసంగాన్ని కొనసాగించారు.
మోడీని గద్దె దించేవరకు తాను చనిపోనన్నారు. ఎనిమిది పదుల వయస్సులో ఉన్న నేను..మోడీని ఓడించే వరకు అలసిపోను అంటూ వ్యాఖ్యానించారు. కేంద్రంలోని బీజేపీ నేతలు జమ్మూ కశ్మీర్ లో ఎన్నికలను నిర్వహించాలని కోరుకోలేదని…వారు తలుచుకుంటే ఎప్పుడో పూర్తి చేసి ఉండేవారన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా రిమోట్ ప్రభుత్వాన్ని నడపాలని అనుకుంటున్నారని విమర్శించారు.
పదేళ్లలో యువతకు ప్రధాని ఏమి ఇవ్వలేదని…అలాంటి వ్యక్తిని మీరు విశ్వసిస్తారా? అని ఖర్గే ప్రశ్నించారు. కాగా, ఖర్గే అస్వస్థతకు గురైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మరాయి.