మిషన్ భగీరథపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క లేవనెత్తిన అంశాలకు ప్రభుత్వం నుంచి సహేతుకమైన జవాబు రావాల్సి ఉంది. తెలంగాణ ప్రభుత్వం భారీగా నీటిపారుదల ప్రాజెక్టులను చేపట్టింది. వీటి ద్వారా సాగునీటితో పాటు తాగునీరు కూడా అందుబాటులోకి వస్తుంది. ఇలా అనేక ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ ద్వారా మొత్తం లక్షా 49 వేల కోట్ల రూపాయల పనులు చేపట్టారు. వీటి ద్వారా ప్రజలకు నీరు అందుబాటులోకి వస్తుంది. మరి ప్రత్యేకంగా తాగు నీటి కోసమంటూ 42 వేల కోట్ల ఖర్చుతో లక్షా 30 వేల కిలోమీటర్ల పైపు లైన్లు వేయాల్సిన అవసరం ఏమొచ్చిందనేది ఆయన ప్రశ్న.
ప్రాజెక్టులను నిర్మించినప్పుడు కాల్వల ద్వారా నీటి సరఫరా జరుగుతుంది. సాగునీటితో పాటు తాగునీటి సరఫరాకు అవకాశం ఉంటుంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా జరిగేదే. అలాంటప్పుడు ప్రత్యేకంగా తాగునీటి కోసం అనే పేరుతో 42 వేల కోట్లు ఖర్చు పెట్టడం అనేది పెద్ద విషయం. ఇది నిజంగా అవసరమైతే అభ్యంతరం ఉండదు. మరి అవసరమా కాదా అనేది భట్టి ప్రశ్న.
ఇదే ప్రాజెక్టు విషయంలో ఆయన మరికొన్ని అనుమానాలను లేవనెత్తారు. సెగ్మెంట్ల వారీగా పిలిచిన టెండర్లను 0.5 నుంచి 0.75 తక్కువకు దక్కించుకోవడానికి ఒకే వ్యక్తి ప్రయత్నించినట్టు ఉందన్నారు. టెండర్లలోని మొత్తాలను గమనిస్తే ఈ అనుమానం కలుగుతుందన్నారు. ప్రాజెక్టుల విషయంలో అవినీతి జరుగుతున్నట్టు అనుమానాలున్నాయని కాంగ్రెస్ సభ్యులు అన్నారు. ఆధారాలు చూపండని ప్రభుత్వం డిమాండ్ చేసింది. అయితే కొన్ని సహేతుకమైన ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ప్రభుత్వం ఇస్తుందా అనేది ప్రశ్న.