సినిమాలకి నంది అవార్డుల ప్రదానోత్సవాన్ని ఒక పండుగలా నిర్వహించేవారు. రాష్ట్ర విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలలో నంది అవార్డుల ప్రదానోత్సవం జరగలేదు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నంది స్థానంలో గద్దర్ అవార్డ్స్ వేడుకని నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రకటించారు. ఇప్పుడు ఈ అవార్డులకు సంబధించిన కార్యచరణ వెలువడింది.
ఉగాదికి గద్దర్ అవార్డులను ప్రదానం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ మేరకు సచివాలయంలో జరిగిన గద్దర్ అవార్డుల కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం వెల్లడించారు. అవార్డుల ప్రదానోత్సవానికి ఏర్పాట్లు చేసుకోవాలని కమిటీ సభ్యులు, అధికారులకు సూచించారు.
అవార్డుల కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్టు చెప్పిన భట్టి, అవార్డుల పంపిణీ కార్యక్రమాన్ని జాతీయ స్థాయి కార్యక్రమాల తరహాలో నిర్వహించాలని సూచించారు. గత పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బిఆర్ఎస్ చిత్ర పరిశ్రమను నిర్లక్ష్యం చేసిందని విమర్శించిన ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. తెలంగాణ సినీ పరిశ్రమ ప్రపంచస్థాయికి ఎదగాలనే రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటోందని తెలియజేశారు.