కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా సుప్రీం కోర్టు, ఈడి ఆదేశాలను మన్నించి భారత్ తిరిగి రాకపోవడంతో కేంద్రప్రభుత్వం చాలా కటిన నిర్ణయాలు తీసుకొంటోంది. మొదట ఆయన పాస్ పోర్ట్ ని తాత్కాలికంగా రద్దు చేసింది. అయినా కూడా మాల్యా ఖాతరు చేయకపోవడంతో దౌత్య హోదా గల ఆయన పాస్ పోర్ట్ ని శాస్వితంగా రద్దు చేసింది. ఆయన రాజ్యసభ సభ్యత్వం కూడా రద్దు చేయాలని పార్లమెంటు ఎథిక్స్ కమిటీ ఈరోజు నిర్ణయించింది. దీనిపై వచ్చే నెల 3లోగా సమాధానం తెలపాలని మాల్యాకి నోటీసు జారీ చేసింది. ఆలోగా ఆయన నుంచి సంతృప్తికరమయిన సమాధానం రానట్లయితే మే 3న తుది నిర్ణయం తీసుకొంటుంది. ఒకసారి దాని ఆమోద ముద్ర పడితే ఇంకా ఆయన రాజ్యసభ సభ్యత్వం రద్దు కావడం కేవలం లాంచనప్రాయమేనని చెప్పవచ్చు. ఆయన పదవీ కాలం జూలై నెలతో ముగుస్తుంది. కనుక ఆయన దీనికి కూడా స్పందించకపోవచ్చు. ఒకవేళ రాజ్యసభ సభ్యత్వం కోల్పోతే దౌత్యపరమయిన రక్షణ కూడా కోల్పోతారు. అప్పుడు సాధారణ పౌరుడుగా పరిగణింపబడతారు. ఇప్పటికే ఆయన పాస్ పోర్ట్ కూడా రద్దయింది కనుక, ఆయనపై చట్టపరంగా చర్యలు చేపట్టడానికి వీలవుతుంది. ఆయన నిర్బంధించి భారత్ పంపించవలసిందిగా బ్రిటన్ ప్రభుత్వాన్ని కోరవచ్చు.