సినిమాను ప్రేక్షకుల్లోకి చేరవేసేది ముందు ఆ సినిమాకు పెట్టే టైటిలే.. సినిమా టైటిల్ బాగా లేక అపజయాలపాలైన సినిమాలు చాలానే ఉన్నాయి. కథకు తగ్గట్టుగా సరైన టైటిల్ పెట్టడం కాస్త కష్టమైన పనే. అయితే అలాంటి విషయాల్లో అల్లరి నరేష్ ప్రతిభ సూపర్ అని అంటున్నారు. ప్రస్తుతం అల్లరి నరేష్, కలక్షన్ కింగ్ మోహన్ బాబు కలిసి నటించిన సినిమా మామ మంచు అల్లుడు కంచు. 24 ఫ్రేమ్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ నిర్మాణంలో మంచు విష్ణు నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ అల్లరి నరేష్ నిర్ణయించాడట.
మోహన్ బాబు, అల్లరి నరేష్ మామ అల్లుళ్లు గా నటిస్తున్న ఈ సినిమాకి ఇదే సరైన టైటిల్ అని అల్లరి నరేష్ నిర్మాతైన విష్ణుతో చెప్పాడట. ఆ టైటిల్ నచ్చినా మళ్లీ అది కాకుండా వేరే టైటిల్ కోసం కూడా చూశారట చిత్ర దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి. చివరగా మోహన్ బాబు ఆమోదంతో అల్లరి నరేష్ పెట్టిన మామ మంచు అల్లుడు కంచు అనే దానికే చిత్ర యూనిట్ పచ్చ జెండా ఊపారట.
ఇవివి సత్యనారాయణ వారసుడైన అల్లరి నరేష్ తండ్రి దర్శకత్వపు మెళుకువలు నేర్చుకుని సినిమాకు ఏ టైటిల్ అయితే సరిపోతుందని నిర్ణయించగలడని అర్ధమైంది. ఒకవేళ మామ మంచు అల్లుడు కంచు సినిమా సూపర్ హిట్ అయితే అల్లరి నరేష్ కి కథ వినిపించి టైటిల్ కోసం తనని సిఫార్సు చేయమని అడిగేందుకు దర్శక నిర్మాతలు క్యూ కట్టినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు..! ఈ నెల 25న విడుదల అవుతున్న మామ మంచు అల్లుడు కంచు సినిమా మీదా చిత్ర యూనిట్ అంతా భారే అంచనాలే పెట్టుకుంది. మరి సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందో తెలుసుకోవాలంటే మరో 4 రోజులు వెయిట్ చేసి చూడాలి.