మమతా బెనర్జీ సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసేది లేదని స్పష్టం చేస్తున్నారు. బెంగల్ లో పాతిక వేల మంది టీచర్లను తీసేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో బెంగాల్లో కలకలం ప్రారంభమయింది. తన కంఠంలో ప్రాణం ఉండగా మీకెవరికి అన్యాయం జరగనివ్వనని టీచర్లకు భరోసా ఇస్తున్నారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టుకు ఆమె ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
గతంలో నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయిందని తేల్చారని ఎందుకు ఆ పరీక్ష మొత్తాన్ని రద్దు చేయలేదని ప్రశ్నించారు. పలు కేసుల్లో కేవలం తప్పు చేసిన వారినే శిక్షించారని కానీ బెంగాల్ విషయంలో మాత్రం పాతిక వేల మందిని తొలగించడానికి ఏ మాత్రం ఆలోచించలేదని అంటున్నారు. బెంగాల్ విద్యా వ్యవస్థను కుప్పకూల్చడానికి చేస్తున్న కుట్రగా ఆమె అభివర్ణిస్తున్నారు. ఈ పాతిక వేల మందిలో తప్పు ఎవరు చేశారో చెప్పాలని.. ఆమె సుప్రీంకోర్టును డిమాండ్ చేస్తున్నారు.
టీచర్ల నియామకాల్లో తప్పులు జరిగాయని.. చెప్పి గతంలో బెంగాల్ హైకోర్టు ఈ పాతిక వేల మంది టీచర్ల నియామకాలను రద్దు చేసింది. ఆ తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి తర్వాత బీజేపీలో చేరి ఎంపీ అయ్యారు. ఇప్పుడు అదే తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. తప్పు చేసిన వారు ఎవరో గుర్తించి.. శిక్షించవచ్చు కానీ అందర్నీ ఎలా తీసేస్తారని మమతా బెనర్జీ ప్రశ్నిస్తున్నారు. ఒక్క సారే పాతిక వేల మందిని తీసేస్తే పిల్లలకు పాఠాలు ఎవరు చెబుతారని ప్రశ్నిస్తున్నారు.
ఈ కేసు విషయంలో తాము సుప్రీంకోర్టులోనే అప్పీల్ కు వెళ్తామని..అక్కడే తేల్చుకుంటామని మమతా బెనర్జీ చెబుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పును ఓ రాష్ట్ర సీఎం ఇలా బహిరంగంగా ధిక్కరించడం సంచలనంగా మారే అవకాశాలు ఉన్నాయి.