ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు కు అకస్మాత్తుగా ఆత్మీయ సంబంధం ఏర్పడటం రాజకీయ వర్గాలలో విస్మయం కలిగిస్తున్నది. పెద్ద నోట్ల రద్దు అనంతరం బహుశా మరే ముఖ్యమంత్రితో కూడా, చివరకు బిజెపి ముఖ్యమంత్రులతో కూడా మోడీ 40 నిముషాలకు పైగా మాట్లాడిన సందర్భం లేదు. పైగా ఒక వారం రోజుల వ్యవధిలోనే వారిద్దరూ మూడు సార్లు కలుసుకున్నారు.
వాస్తవానికి పెద్ద నోట్ల రద్దు జరగగానే రెండు వారాల వరకు కేసీఆర్ మౌనంగానే ఉన్నారు. ఈ రద్దు వల్లన రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందని ఆందోళన ప్రకటించటం, ఆ మేరకు కేంద్రం ఆదుకోవాలని కోరడం మినహా పెద్దగా స్పందించనే లేదు. కనీసం నగదు రహిత చెల్లింపుల విషయంలో కూడా చేప్పుకోదగిన చొరవను తీసుకోలేదు. అయితే `అకస్మాత్తుగా’ ప్రధానమంత్రి నుండి ఫోన్ రావడం, నోట్ల రద్దు గురించి మాట్లాడుకొందాం ఢిల్లీ రమ్మనమని ఆయన కోరడంతో కేసీఆర్ సంతోషానికి అవధాలు లేకపోయింది.
అప్పటినుండి నగదు రహిత చెల్లింపుల విషయంలో క్రియాశీలంగా వ్యవహరించడం ప్రారంభించారు. మూడు వారాల తరువాతనే ఈ విషయమై హడావుడిగా సమీక్షా సమావేశం, మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేశారు.
నోట్ల రద్దుపై ముందుగా ప్రధానిపై ధ్వజం ఎత్తి , ఆగ్రవేశాలు వ్యక్తం చేసింది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బనెర్జీ అని అందరికి తెలిసిందే. అంతటితో ఆగకుండా ఆమె ఢిల్లీ రావడం, అన్ని ప్రతిపక్షాలను ఈ విషయమై కలుపుకొని ప్రభుత్వంపై దాడికి ప్రయత్నించడం, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో కలసి ఒక బహిరంగ సభలో పాల్గొనడం ఒక విధంగా కేసీఆర్ పట్ల వరంగా మారినట్లు చెప్పవచ్చు.
మిగిలిన ముఖ్యమంత్రులు కూడా మమతతో చేతులు కలపకుండా జాగ్రత్త పడాలని గ్రహించిన ప్రధాని వెంటనే కేసీఆర్ తో పాటు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కు ఫోన్ చేసి మాట్లాడారు. ఢిల్లీ రమ్మనమని ఆహ్వానించారు. కేసీఆర్ వెంటనే ఢిల్లీ వెళ్లి ప్రశాంతంగా ప్రధానిని కలసి వచ్చారు. అయితే త్వరలో ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న దృష్ట్యా అఖిలేష్ యాదవ్ ప్రచారం లేకుండా పార్లమెంట్ లో ప్రధానిని కలిశారు.
ఈ విషయం పసిగట్టిన అయన ప్రత్యర్థి, బీఎస్పీ అధినేత్రి మాయావతి వెంటనే ఈ విషయాన్నీ మీడియాకు చేరవేశారు. బిజెపి తో అఖిలేష్ చేతులు కలుపుతున్నారనే ప్రచారం చేపట్టారు. అఖిలేష్ ఎప్పుడూ మాయావతిని గౌరవంగా `బౌ’ (ఆంటీ) అని సంభోదిస్తూ ఉంటారు. కానీ ప్రధానితో తన సమావేశాన్ని రచ్చకీడ్చే ప్రయత్నం చేయడంతో కోపం పట్టలేక ఆమె “బిబిసి” (బౌ బ్రో-అడ్కాస్టింగ్ కార్పొరేషన్) గా మారినదని విరుచుకుపడ్డారు అనుకోండి.
ఇక ప్రధానిని కేసీఆర్ కలసి రావడాన్ని తెలంగాణలోని కాంగ్రెస్ నాయకులు సహించలేక పోతున్నారు. ఆయన కేవలం `కుటుంభం ప్రయోజనాలు’ (నల్ల ధబునం) కోసం మాత్రమే కలిసారంటూ అపవాదులు వేయడం ప్రారంభించారు. ప్రధానితో అంతసేపు ఏమి మాట్లాడారో బయటకు చెప్పాలని అంటూ శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు మోహ్హమద్ ఆలీ షబ్బీర్ డిమాండ్ చేశారు.