దేశంలో ప్రస్తుతం పెగాసస్ నిఘా వ్యవహారంపై రేగుతున్న దుమారం అంతా ఇంతా కాదు. అయితే కేంద్రం మాత్రం విచారణకు ఆదేశించే ఉద్దేశంలో లేదు. ఈ విషయం చాలా సూటిగానే చెబుతోంది. ప్రధానంగా కేంద్రంపైనే అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్న సమయంలో కేంద్రం విచారణకు ఆదేశిస్తుందని ఎవరూ అనుకోవడం లేదు. దీంతో కొంత మంది సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. బెంగాల్ సర్కార్ మమతా బెనర్జీ మరో అడుగు ముందుకేశారు. తాము స్వయంగా విచారణ చేయబోతున్నట్లుగా ప్రకటించారు. ప్రత్యేకంగా కేబినెట్ భేటీని ఏర్పాటు చేసిన మమతా బెనర్జీ.. అందులో పెగాసస్‌పై విచారణకు ద్విసభ్య కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఈ కమిటీలో మాజీ న్యాయమూర్తులు ఉంటారు. పెగాసస్ వ్యవహారాన్ని దర్యాప్తు చేయాలంటే.. కేంద్ర ప్రభుత్వం మాత్రమే అక్కర్లేదని… బెంగాల్‌కు చెందిన వ్యక్తులపైనా నిఘా పెట్టినట్లుగా తేలింది కాబట్టి… తమ పరిధిలో తాము దర్యాప్తు చేస్తామని బెంగాల్ సర్కార్ చెబుతోంది. మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ సహా పీకే మరికొంతమంది బెంగాలీ నేతలపై కూడా…పెగాసస్ నిఘా పెట్టారని.. మీడియాలో ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని కేంద్రం కొట్టి వేస్తోంది. విపక్షాలు మాత్రం విచారణకు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వాలకు మాత్రమే పెగాసస్ సాఫ్ట్ వేర్ అమ్ముతామని.. అమ్మామని.. ఇందులో మరో మాటలేదని ఇజ్రాయెల్ సంస్థ చెబుతోంది.
దీంతో ఇండియాలో ఎవరిపైనైనా పెగాసస్‌ను ప్రయోగించి ఉంటే.. ఖచ్చితంగా అది ప్రభుత్వమే అయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలా కాకుండా ప్రైవేటు వ్యక్తులు.. అత్యంత ముఖ్యులైన వీఐపీలపై ఇలానిఘా పెట్టి ఉంటే దేశభద్రత ప్రమాదంలో పడినట్లవుతుంది. దీంతో బెంగాల్ ప్రభుత్వం చేయించబోతున్న దర్యాప్తులో ఎలాంటి విషయాలు వెల్లడవుతాయన్నది ఆసక్తికరంంగా మారింది.