జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలనుకుంటున్న కేసీఆర్ పోల్ పొజిషన్ కోసం చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నారు. అయితే అనుకూలమైన పరిణామాలు జరగడం లేదు. దీంతో సైలెంట్ అయ్యారు. నెలాఖరులో జాతీయ పార్టీ ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ఈ లోపే మమతా బెనర్జీ రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేసేందుకు బీజేపీయేతర పార్టీలన్నీ కలుద్దామని ముహుర్తం ఖరారు చేశారు. ఢిల్లీలో ఈ నెల 15న జరిగే సమావేశానికి సీఎం కేసీఆర్ను మమత బెనర్జీ ఆహ్వానించారు.
8 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సహా 22 మంది జాతీయ నేతలకు మమత లేఖ రాశారు. సోనియా గాంధీకి కూడా మమతా బెనర్జీ ఆహ్వానం పంపారు. రాష్ట్రపతి ఎన్నికల దృష్ట్యా విపక్షాలను బెంగాల్ సీఎం కూడగడుతున్నారు. రాష్ట్రపతి ఎన్నికలో బలమైన ప్రత్యర్థిని బరిలో నిలిపేందుకు మమత తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఈ నెల 15న ఢిల్లీలో నిర్వహించే భేటీకి 22 మంది నేతలకు ఆహ్వానం పంపారు. తెలంగాణ, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్ సీఎంలతో పాటు పలువురి ప్రముఖులకు లేఖలు రాశారు .
ఏపీ సీఎం జగన్ను మమతా బెనర్జీ బీజేపీ మిత్రపక్షాల జాబితాలో చేర్చారు. రాష్ట్రపతి ఎన్నికల్లో పెద్దగా ఓటింగ్ లేకపోవడంతో టీడీపీ అధినేతను కూడా పట్టించుకున్నట్లుగా లేరు. పైగా జాతీయ రాజకీయాల విషయంలో చంద్రబాబు పూర్తిగా ఆసక్తి చూపించడం లేదు. కేసీఆర్ మాత్రమే పూర్తి స్థాయిలో ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికలపై కొంత కాలంగా కసరత్తు చేస్తున్నారు. ఈ భేటీకి కేసీఆర్ వెళ్తారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది.