సార్వత్రిక ఎన్నికల పోలింగ్ .. రెండు దశలు ముగిసే సరికి.. రాజకీయం కొంత కొంతగా.. మారుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. బీజేపీయేతర పార్టీల్లోకి.. మెల్లగా.. టీఆర్ఎస్ కూడా చేరుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. బెంగాల్లో రెండో దశ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సమయంలోనే… తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. జాతీయ మీడియాకు ఇంటర్యూలు ఇచ్చి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ… మోడీ మళ్లీ ప్రధాని కాబోరని తేల్చిన ఆమె… బెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలే ఈ సారి… కింగ్ మేకర్లుగా నిలవబోతున్నాయని తేల్చారు. యూపీలో ఎస్పీ – బీఎస్పీ కూటమి, బెంగాల్లో తమ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుంది. ఈ రెండు రాష్ట్రాల నుంచి బీజేపీకి వ్యతిరేకంగా వంద సీట్లు మూడు పార్టీలకు వస్తాయని అంచనా వేశారు.
అయితే అదే సమయంలో ఆమె.. ఫెడరల్ ప్రంట్ గురించి పదే పదే చెబుతున్నారు. మామూలుగా ఫెడరల్ ఫ్రంట్ పదాన్ని కేసీఆర్ ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. ఈ కోణంలో పార్టీలన్నింటినీ ఏకం చేసేందుకు ఆయన రెండు సార్లు ప్రయత్నం చేసి.. తన ప్రొ బీజేపీ స్టాండ్ కారణంగా.. ఎవర్నీ దగ్గరకు తీసుకోలేకపోయారు. ఈ లోపు బీజేపీకి వ్యతిరేకంగా పార్టీలన్నీ… ఓ కూటమిగా మారకపోయినా… అదే కూటమిగా పోరాటం అయితే చేస్తున్నాయి. ఈ కూటమికి మమతా బెనర్జీ పెడరల్ ఫ్రంట్ అని పేరు పెట్టేశారు. ఇంకా విచిత్రం ఏమిటంటే.. ఈ ఫ్రంట్‌లో ఉన్న నేతలతో టచ్‌లో ఉన్నామని చెప్పుకొస్తున్నారు. ఇలా టచ్‌లో ఉన్న నేతల్లో… చంద్రబాబునాయుడు, అఖిలేష్ యాదవ్, తేజస్వీ యాదవ్ లతో పాటు కేసీఆర్‌తో కూడా టచ్‌లో ఉన్నట్లుగా ప్రకటించేశారు. దీంతో.. రాజకీయ పరిస్థితులు మారిపోతే… కేసీఆర్ కూడా ప్రొ బీజేపీ స్టాండ్‌ను వదిలేసి… ఇతర ప్రాంతీయ పార్టీల గూటిలోకి చేరుతారనే ప్రచారం ఊపందుకుంటోంది.
కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌కు తానే నాయకత్వం వహించాలనుకుంటున్నారు. అందుకే ఇతర పార్టీలను తన నాయకత్వంలోని ఫ్రంట్‌లోకి రావాలని ఆహ్వానించారు. కానీ ఎవరూ ఆసక్తి చూపించలేదు. ఏపీ నుంచి ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే.. కేసీఆర్‌తో కలిసి ఫెడరల్ ఫ్రంట్‌లో చేరుతానంటూ… ఆసక్తి చూపించారు. కేసీఆర్ చెప్పే ఫ్రంట్‌లో.. ఇప్పుడు.. కేసీఆర్‌తో పాటు జగన్ మాత్రమే ఉన్నారు. మమతా బెనర్జీ… కేసీఆర్‌తో తాను టచ్‌లో ఉన్నానని చెబుతున్నారు. అంటే… జగన్మోహన్ రెడ్డిని.. అలా వదిలేయడానికి కేసీఆర్ రెడీ అయిపోయినట్లేనన్న భావన రాజకీయవర్గాలకు వస్తోంది. మొత్తానికి.. అసలు ఫలితాలు తర్వాత జాతీయ రాజకీయాల్లో.. ఓ మ్యాజిక్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది.