ప్రశాంత్ కిషోర్ వ్యవహారశైలిపై రాజకీయ నేతల్లోనూ అసహనం పెరిగిపోతోంది. స్ట్రాటజిస్ట్‌గా పని చేశారని గౌరవం ఇస్తూంటే ఆయన అతిగా చనువు తీసుకుంటున్నారు. తాను లేకపోతే గెలుపు లేదని.. తానే గెలిపించానన్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నారు. అంతే కాదు ఆయా పార్టీల తరపున ప్రకటనలు కూడా చేయడం ప్రారంభిస్తున్నారు. దీంతో తేడా వస్తోంది. తృణమూల్ విషయంలో అదే పని చేస్తూండటంతో ఆ పార్టీ నేతలు ఫైరవుతున్నారు. ఆయన రాజకీయ సలహాలకే పరిమితం కావాలని.. పార్టీ తరపున ప్రకటనలు చేస్తే ఊరుకునేదిలేదని హెచ్చరించారు.
ఇటీవల కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం తృణమూల్ అంటూ పీకే మమతా బెనర్జీని ఉబ్బేస్తున్నారు. ఓ ఈశాన్య రాష్ట్రంలో కొంత మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్ని తృణమూల్‌లో చేర్చారు. ఇతర రాష్ట్రాల్లోనూ తృణమూల్ జోరుగా ఉంటుందంటూ ప్రచారం చేస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పని అయిపోయిందన్నట్లుగా చెబుతున్నారు. చివరికి దక్షిణాది రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌కు బదులుగా తృణమూల్ అన్నట్లుగా పీకే టీం ప్రచారం చేస్తూండటంతో… మమతా బెనర్జీ పార్టీకి కూడా ఎక్కడో తేడా కొట్టినట్లుగా అనిపించింది. అందుకే వెంటనే రంగంలోకి దిగి నష్ట నివారణ చర్యలు ప్రారంభించారు.
ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో మాత్రమే తృణమూల్ కాంగ్రెస్ పని చేస్తుందని… తమిళనాడులో తమ పార్టీకి ఏం పని లేదని తృణమూల్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ ప్రకటించారు. ప్రశాంత్ కిషోర్‌ను ఐదేళ్ల కాలానికి మాత్రమే నియమించుకున్నామని.. ఆయన పనితీరుపై మమతా బెనర్జీ అంచనా వేసుకుని పొడిగించాలో లేదో నిర్ణయం తీసుకుంటారని ప్రకటించారు. బెంగాల్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌లో చేరేందుకు తీవ్రమైన ప్రయత్నాలు చేసి.. సాధ్యం కాక వెనక్కి తగ్గిన పీకే.. ఆ తర్వాత తృణమూల్‌ను అడ్డం పెట్టుకుని.. కాంగ్రెస్‌పై పగ సాధించే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ… తృణమూల్‌కు కూడా ఆయన రాజకీయం అర్థమైనట్లుగా ఉంది. అందుకే దూరం పెట్టే ఆలోచన చేస్తోంది.