దేశంలో బీజేపీయేతర ఫ్రంట్ ప్రయత్నాలకు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ చెక్ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమె కాంగ్రెస్కు దూరంగా జరుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మూడు రాష్ట్రాల్లో విజయం సాధించింది. కాస్త బలం పుంజుకుంటుందనే అభిప్రాయం ఏర్పడింది. బీజేపీని వ్యతిరేకించేవారందరూ సంతోషించారు. కానీ మమతా బెనర్జీ మాత్రం…మౌనంగా ఉండిపోయారు. కాంగ్రెస్ గెలిచినందుకు కనీసం రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు కూడా చెప్పలేదు. మమతా బెనర్జీ తీరు జాతీయ రాజకీయాలను పరిశీలిస్తున్న చాలా మందిని ఆశ్చర్య పరిచింది. గతంలో.. సోనియాగాంధీతో పలుమార్లు భేటీ అయిన మమతా బెనర్జీ.. కాంగ్రెస్తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ పార్టీ బలపడుతోందనే సంకేతాలు వచ్చే సరికి దూరం జరుగుతున్నారు.
బీజేపీకి… కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కాకపోయినా… మిత్రపక్షాలతో కలిసి బీజేపీని ఓడించగలదనే అభిప్రాయం ఇప్పుడు దేశంలో ఏర్పడుతోంది. ఇలాంటి సమయంలో ఆమె ఎందుకు దూరం జరుగుతున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. అయితే.. ఆమె లక్ష్యం ప్రధానమంత్రి పదవేనని… అందరికీ తెలుసు. కాంగ్రెస్ బలపడి… 150కిపైగా లోక్ సభ సీట్లు తెచ్చుకుంటే…రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అవుతారని.. తనకు అవకాశం రాదని ఆమె అంచనా వేసుకుంటున్నట్లు బెంగాల్ రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అదే కాంగ్రెస్తో కాకుండా విడిగా ఉంటే.. కనీసం కుమారస్వామికి వచ్చినట్లు అయినా అవకాశం వస్తుందనే ఆలోచనలో మమతా బెనర్జీ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
మమతా బెనర్జీ ఆలోచనలకు.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఊపిరి పోశాయి. టీఆర్ఎస్ విజయం సాధించడంతో.. ఆమె కాంగ్రెస్, బీజేపీలకు దూరంగా.. మరో కూటమి కట్టడానికి అవకాశాలు ఉన్న వాతావరణం ఏర్పడింది. కాంగ్రెస్ నాయకత్వాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేని ఎస్పీ, బీఎస్పీ, బీజేడీ లాంటి పార్టీలు కూడా… కలిస్తే… మరో ప్రత్యామ్నాయ కూటమికి రంగం సిద్దం అయినట్లే భావించవచ్చు. అయితే.. ఈ పార్టీలన్నీ కలిస్తే.. మళ్లీ నాయకత్వ సమస్య వస్తుంది. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించుకునేందుకు సమయం లేదని.. రాజకీవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే పార్టీలు.. కొత్త కూటమికి ప్రయత్నాలు చేస్తే.. అది మోడీ నెత్తిన పాలు పోసినట్లవుతుందనే అంచనాలు ఉన్నాయి. మరి దీదీ ఏం చేస్తారో..?