దేశంలో రాజకీయంగా నరేంద్రమోడీకి ప్రత్యామ్నాయంగా భావిస్తున్న నేతల్లో ఒకరు మమతా బెనర్జీ. ఆమె ఫైటర్. రాజకీయ జీవితం మొత్తం పోరాటాలతోనే గడిచింది. ఇప్పుడు నరేంద్రమోడీతో పోరాటానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే కూడా కాని మమతా బెనర్జీని .. ముఖ్యమంత్రి పదవి నుంచే దించేసే అవకాశం పరోక్షంగా అయినా కేంద్రం చేతుల్లోనే ఉంది. ఆరు నెలల్లోనే ఆమెను అసెంబ్లీకి ఎన్నిక కాకుండా చేస్తే.. ఆమె పదవి పోతుంది. కేంద్రం అదే ప్రణాళిక అమలు చేస్తోందన్న అంచనాలో ఉన్న మమతా బెనర్జీ… బీజేపీకి స్పష్టమైన సందేశం పంపారు. తనను కోల్కతాలో ఉండనీయకపోతే.. తాను ఢిల్లీలోనే రచ్చ చేస్తానని.. బీజేపీతో పోరాటానికి ఫుల్ టైం కేటాయిస్తానని తేల్చేశారు.
మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంటరీ కమిటీ చైర్మన్గా నియమితులయ్యారు. ఏ పార్టీకైనా ఎంపీలు మాత్రమే పార్లమెంటరీ కమిటీ చైర్మన్గాఉంటారు. ఎంపీలకు నాయకత్వం వహించాలంటే.. ఎంపీగానే ఉండాలనేది ఇప్పటి వరకూ రూల్. కనీ మమతా బెనర్జీ మాత్రం దాన్ని తోసిపుచ్చారు. తన పార్టీ పార్లమెంటరీ కమిటీకి తానే చైర్మన్ అయ్యారు. అంటే.. ఆమె ఢిల్లీలోనే ఎక్కువ సమయం గడపాలని అనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. గత కొద్ది రోజులుగా మోడీతో నేరుగా తలపడేందుకు సిద్దమని.. ప్రాంతీయ పార్టీలన్నింటినీ కలుపుకుని వెళ్తామని ప్రకటిస్తున్నారు.
ఒక వేళ ఎమ్మెల్యే పదవికి ఎన్నికయ్యే పరిస్థితి లేకపోతే ఆమె సీఎంగా రాజీనామా చేయక తప్పదు.. అప్పుడు మేనల్లుడి అభిషేక్ బెనర్జీని సీఎం కుర్చీలో కూర్చోబెట్టి… మోదీ ముక్త్ భారత్ కోసం పూర్తి స్థాయిలో శ్రమించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి తనను ఎమ్మెల్యేగా ఎన్నిక కాకుండా చేస్తే.. బీజేపీకి మళ్లీ అధికారం రాకుండా చేయడానికి ఆ సమయం మొత్తం ఉపయోగిస్తానని బీజేపీకి… మమతా బెనర్జీ స్పష్టమైన సందేశమే పంపుతున్నారు.