పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ మళ్ళీ విజయం సాధించగానే ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ చాలా ముఖ్యమైన ప్రకటన చేసారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన జి.ఎస్.టి.బిల్లుకి మద్దతు ఇస్తామని ప్రకటించారు. నిన్న మొన్నటి వరకు భాజపా, మోడీల పేరు చెపితే మండిపడిన మమతా బెనర్జీ, ఎవరూ అభ్యర్ధించకపోయినా తనంతట తానే మోడీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఆ బిల్లుకి మద్దతు ఇస్తామని చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఎన్నికలు పూర్తవగానే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్డీయేలో చేరిపోతుందని, ఆ రెండు పార్టీల మద్య లోపాయికారీ ఒప్పందం ఉందని అందుకే అవి ఒకదానికొకటి ఎన్నికలలో సహకరించుకొంటున్నాయని, ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్, వామపక్షాలు ఆరోపించాయి. ఎన్నికలలో విజయం సాధించిన మరుక్షణమే మమతా బెనర్జీ ఈ ప్రకటన చేయడంతో వాటి ఆరోపణలు నిజమేనని అనుమానించవలసి వస్తోంది. అయితే మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోడీతో చేతులు కలిపితే నేరం కాదు. ప్రస్తుతం ఆమెకు ఆ అవసరం లేదు కూడా. కానీ గత ఏడాది కేంద్ర ప్రభుత్వం తన ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు చేసింది. వాటిని ఆమె చాలా ధీటుగానే ఎదుర్కొన్నారు. కేంద్రం నుంచి మళ్ళీ తన ప్రభుత్వానికి అటువంటి సమస్యలు రాకూడదనే ఉద్దేశ్యంతోనో లేక ఎన్డీయేలో చేరే ఉద్దేశ్యంతోనో ఆమె జి.ఎస్.టి.బిల్లుకి మద్దతు ఇస్తామని బేషరతుగా ప్రకటించారేమో? కారణాలు ఎవయినప్పటికీ అది చాలా మంచి నిర్ణయమే.
మోడీ ప్రభుత్వానికి లోక్ సభలో మెజారిటీ ఉన్నందున అక్కడ బిల్లుకి ఆమోద ముద్ర వేయించుకోగలిగింది కానీ రాజ్యసభలో కాంగ్రెస్ మిత్రపక్షాలదే పై చెయ్యిగా ఉంది కనుక అక్కడ బిల్లు ఆగిపోయింది. ఇప్పుడు మమతా బెనర్జీ తనంతట తానుగా మద్దతు ఇస్తామని ప్రకటించారు. అలాగే అన్నాడిఎంకె వంటి మరికొన్ని పార్టీల మద్దతు కూడా గట్టగలిగితే కాంగ్రెస్ వ్యతిరేకించినా బిల్లుని ఆమోదింపజేసుకోవచ్చు. అసోం రాష్ట్రంలో 86 సీట్లు గెలుచుకొని భాజపా అధికారం వచ్చింది కనుక ఆ రాష్ట్రం తరపున రెండు రాజ్యసభ సీట్లు భాజపాకి పెరుగుతాయి. కనుక ఈసారి తప్పకుండా జి.ఎస్.టి.బిల్లుని ఆమోదించుకొనే అవకాశాలున్నాయి.