పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఢిల్లీలో హల్ చల్ చేశారు. నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజెన్స్ (ఎన్.ఆర్.సి.) అంశమై ఆమె పలువురు నేతల్ని కలిశారు. అసోంలో దాదాపు 40 లక్షల మందిని ఈ జాబితాలో లేనట్టు కేంద్రం ప్రకటించడం, తరువాత టార్గెట్ పశ్చిమ బెంగాల్ అంటూ ప్రకటించడంపై మమతా మండిపడుతున్న సంగతి తెలిసిందే. వారికి అండగా తానుంటా అంటున్నారు. అంతేకాదు, ఉన్నపళంగా వారిని పొమ్మంటే ఎక్కడికి పోతారంటూ వెంట నిలుస్తున్నారు. ఢిల్లీ వెళ్లిన మమతా.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో భేటీ అయ్యారు. ప్రతిపక్ష పార్టీలకు దాదాపు అందరు నేతల్నీ ఆమె కలుసుకున్నారు. టీడీపీ, వైసీపీ, జేడీయూ, శివసేనలతోపాటు అద్వానీ లాంటి సీనియర్ భాజపా నేతల్ని కూడా మమతా బెనర్జీ కలిశారు. మోడీ కంటే ముందుగానే భాజపాలో సీనియర్లతో తనకు స్నేహం ఉందంటూ, అద్వానీ లాంటివారితో భేటీ కేవలం మర్యాదపూర్వకమేననీ, రాజకీయ ప్రాధాన్యతతో చూడొద్దని ఆమె చెప్తున్నారు.
ఇదంతా వచ్చే ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకునే మమతా చేస్తున్నారన్న అభిప్రాయాలు కలుగుతున్నాయి. అయితే, ప్రధానమంత్రి ఎవరూ ఏంటీ అనే అంశాలు తరువాత చూసుకుందామనీ, ముందుగా భారతీయ జనతా పార్టీని ఫినిష్ చేద్దామని ఆమె వ్యాఖ్యానించడం విశేషం! రాజకీయంగా ప్రజలను భాజపా తీవ్రంగా హింసిస్తోందనీ, కాబట్టి అందరూ ఐక్యంగా పోరాడాల్సిన సమయం వచ్చిందన్నారు. ‘మీరు ప్రధాని రేసులో ఉన్నారా లేరా; మీ అభ్యర్థిత్వంపై రాహుల్ సుముఖంగా సంకేతాలు ఇచ్చారా’ అనే సూటి ప్రశ్నలకు కూడా ఆమె సమాధానం ఇవ్వకుండా.. ముందుగా భాజపా పనిపడదామనే చెప్పారు. ప్రస్తుతానికి ఆమె ప్రధాని పదవిపై ఆశలు లేవని చెబుతున్నా… అన్ని పార్టీలనూ ఇప్పట్నుంచీ కలుపుకుని వెళ్తూ, సరిగ్గా ఎన్నికల సమాయానికి ఆమె బయటపడే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే, దేశవ్యాప్తంగా బలమైన ప్రాంతీయ పార్టీలను ఒక వేదికపైకి తెచ్చేందుకు మమతా కూడా ఈ మధ్య ప్రయత్నాలు మొదలుపెట్టారు కదా!
తాజాగా ఈ ఎన్.ఆర్.సి. అంశం తెరమీదికి రావడంతో… ముస్లింల నుంచి మమతా బెనర్జీకి అనూహ్యంగా మద్దతు పెరుగుతోందన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది. అసోం మాత్రమే కాదు, బెంగాల్ కూడా వదలేది లేదంటూ భాజపా అధ్యక్షుడు అమిత్ షా కవ్వింపు ప్రకటనలు చేస్తున్నారు. అంతేకాదు, పోలీసులు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా కోల్ కతాలో ర్యాలీ చేసి తీరతా అంటూ ఆయన హెచ్చరించడం… మొత్తానికి, ఈ అంశంలో భాజపా మరింత కఠినంగా వ్యవహరించాలనే ఉద్దేశంతోనే కనిపిస్తోంది. ఇదే క్రమంలో బాధితులకు అండగా మమతా కనిపిస్తున్న పరిస్థితి ఏర్పడింది.