బెంగాల్ రాజకీయాలు దేశంలో ప్రాంతీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చేలా చేస్తున్నాయి. బెంగాల్ గవర్నర్ మమతా బెనర్జీకి బదులుగా తానే పాలన చేస్తానన్నట్లుగా ప్రకటనలు చేస్తున్నారు. ప్రభుత్వంపై ప్రతిపక్ష నేతలెవ్వరూ విరుచుకుపడనట్లుగా విరుచుకుపడుతున్నారు. దీంతో మమతా బెనర్జీ – గవర్నర్ మధ్య పచ్చగడ్డి వేస్తే నిప్పులు వస్తున్నాయి. ఈ క్రమంలో బెంగాల్ అసెంబ్లీని ప్రోరోగ్ చేస్తూ బెంగాల్ గవర్నర్ తీసుకున్న నిర్ణయంపై స్టాలిన్ మండిపడ్డారు. ఈ క్రమంలో మమతా బెనర్జీ స్టాలిన్‌కు ఫోన్ చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్లో తెలిపారు.
మమతా బెనర్జీ ఫోన్ చేసినట్లుగా కేసీఆర్ కూడా ప్రెస్మీట్లో తెలిపారు. గవర్నర్ వ్యవస్థను బీజేపీ దుర్వినియోగం చేస్తోందన్నారు. తమిళనాడులోనూ స్టాలిన్‌కు గవర్నర్‌తో చిక్కులు ఉన్నాయి. నీట్ బిల్లును గవర్నర్ వెనక్కి పంపారు. ఇలాంటి పరిస్థితులతో గవర్నర్ వ్యవస్థకి వ్యతిరేకంగా అందరూ ఏకమయ్యే అవకాశం కనిపిస్తోంది. ముందుగా గవర్నర్ వ్యవస్థను కేంద్రం దుర్వినియోగం చేయడంపై పోరాడే అవకాశం కనిపిస్తోంది. త్వరలో బీజేపీయేతర సీఎంలందరూ ఢిల్లీలో సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. అలా సమావేశం అయితే ఓ ప్రాంతీయ పార్టీల కూటమికి దగ్గర దారి ఏర్పడినట్లే అనుకోవాలి.
కేసీఆర్ కూడా అదే కోరుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా హాజరవుతారు. ఇటీవల కేసీఆర్ కూడా గవర్నర్‌తో సఖ్యతగా లేరు. రిపబ్లిక్ డే వేడుకలకు కేసీఆర్ రాజ్ భవన్‌కు హాజరు కాలేదు. గవర్నర్ బయటకు తెలియని రాజకీయం ఏదో చేస్తున్నారని కేసీఆర్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా గవర్నర్ల వ్యవస్థపై బీజేపీయేతర సీఎంలు తొలి పోరాట కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది.