బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ..భారతీయ జనతా పార్టీ వ్యూహాలకు ప్రతి వ్యూహాలు రూపొందించేందుకు ఏ మాత్రం ఆలస్యం చేయడం లేదు. ఖాళీగా ఉన్న అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నికలు పెట్టే ఉద్దేశం బీజేపీ లేదని.. ఓ అభిప్రాయానికి వచ్చిన మమతా బెనర్జీ ప్రతి వ్యూహం అమలు చేయడం ప్రారంభించారు. బెంగాల్లో శాసనమండలి ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేశారు. అసెంబ్లీలో తృణమూల్‌కు మూడింట రెండు వంతుల మెజార్టీ ఉండటంతో ఆ మేరకు తీర్మానం చేశారు. ఉపఎన్నికలు నిర్వహించకపోతే.. శాసనమండలి సభ్యురాలిగా ఎన్నికయ్యేందుకు మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
అయితే శాసనమండలిని ఏర్పాటు చేయడం కూడా కేంద్రం అనుమతితోనే జరగాల్సి ఉంది. శాసనసభ తీర్మానాన్ని మమతా బెనర్జీ సర్కార్ కేంద్రానికి పంపుతుంది. శాసనసభ తీర్మానానికి అనుగుణంగా పార్లమెంట్ చట్టం చేయాల్సి ఉంది. శాసనమండలి ఏర్పాటు లేదా రద్దు కోసం రాష్ట్ర ప్రభుత్వాలు తీర్మానం చేస్తే సరిపోదు. రాజ్యాంగం ప్రకారం కచ్చితంగా పార్లమెంట్ చట్టం అవసరం. మమతా బెనర్జీని చట్టసభలకు ఎన్నిక కాకుండా చేయాలనుకుంటే బీజేపీ .. తీర్మానాన్ని తొక్కి పెట్టవచ్చు. దీన్ని ప్రశ్నించే పరిస్థితి లేదు. రాజకీయంగా విమర్శలు మాత్రం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే రాజస్థాన్, అస్సాం ప్రభుత్వాలు పంపిన శాసనమండలి ఏర్పాటు తీర్మానాలు రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్నాయి. ఏపీ పంపిన విధానమండలి రద్దు తీర్మానం ఇంకా బిల్లు వరకూ రాలేదు.
ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే అవకాశం లేదన్న కారణంగా ఉత్తరాఖండ్ సీఎంగా ఉన్న తీరథ్ సింగ్ తో బీజేపీ హైకమాండ్ రాజీనామా చేయించింది. ఉపఎన్నికలు పెట్టే అవకాశం లేదని.. ఈసీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. మమతా బెనర్జీ… నందిగ్రాం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఎమ్మెల్యేగా ఆరు నెలల్లో గెలిస్తే సీఎంగా ఉంటారు. లేకపోతే రాజీనామా చేయక తప్పదు. మమతను టార్గెట్ చేసే.. తీరత్ సింగ్‌ను బీజేపీ హైకమాండ్ బలిచ్చిందని బెంగాల్ రాజకీయ పార్టీలు అంచనా వేస్తున్నాయి. అదే నిజం అయితే.. మండలి ఏర్పాటునూ బీజేపీ అడ్డుకుంటుంది.